మహారాష్ట్ర రాజకీయంలో మరో సంచలన వ్యాఖ్యలు ముందుకు వచ్చాయి. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ను పక్కన పెట్టి ఏక్ నాథ్‌ను సీఎంగా చేయడానికి గుండెను దిటవు చేసుకోవాల్సి వచ్చిందని మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ వివరించారు. తమకు ఆ నిర్ణయం ఎంతో బాధ కలిగిందని, కానీ, నిర్ణయాలను తాము స్వాగతించామని తెలిపారు.
ముంబయి: ఏక్‌నాథ్ షిండే సారథ్యంలో బీజేపీ మద్దతు మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తొలిసారి అధికారిక శిబిరం నుంచి కలకలం రేపే వ్యాఖ్యలు వినిపించాయి. మహా వికాస్ అఘాదీ ప్రభుత్వాన్ని ధిక్కరించి శివసేన పార్టీ అసమ్మతి నేతలు బీజేపీతో కాంటాక్ట్‌లోకి వెళ్లారు. బీజేపీ మద్దతుతో చివరకు వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు అయితే చేశారు. కానీ, సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ఉంటారని చాలా మంది ఆశించారు. కానీ, ఏక్‌నాథ్ షిండే సీఎంగా, ఆయన డిప్యూటీగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణం చేశారు. ఈ పరిణామం దేశ రాజకీయాలను కుదిపేసింది.
బీజేపీ ఏక్‌నాథ్ షిండేను సీఎం చేసి కూర్చోబెడుతుందని బహుశా రెబల్ శివసేన ఎమ్మెల్యేలు కూడా భావించి ఉండకపోవచ్చు. ఏక్‌నాథ్ షిండేను సీఎంగా చేసిన బీజేపీలోనూ అంతర్గతంగా అసంతృప్తులు ఉండే ఉంటాయని అనుకునేవారు. కానీ, ఈ రోజు అది బయట పడింది. ఏకంగా బీజేపీ మహారాష్ట్ర యూనిట్ చీఫ్ ఈ అసంతృప్త వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది.
బీజేపీ మహారాష్ట్ర చీఫ్ చంద్రకాంత్ పాటిల్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో శనివారం మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్‌కు బదులు శివసేన నేత ఏక్‌నాథ్ షిండే సీఎంగా బాధ్యతలు తీసుకోవాలని పార్టీ బరువెక్కిన గుండెతో నిర్ణయం తీసుకుందని అన్నారు. పార్టీ స్పష్టమైన సందేశాన్ని ఇవ్వడానికి, ప్రభుత్వ స్థిరత్వాన్ని కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు.
అస్థిరత్వం దరి చేరకుండా.. సరైన సందేశాన్ని పంపే నాయకుడు తమకు అవసరం పడిందని, అందుకే కేంద్ర నాయకత్వం, దేవేంద్ర ఫడ్నవీస్ సంయుక్తంగా ఏక్‌నాథ్ షిండేను సీఎం చేయాలని నిర్ణయానికి వచ్చారని పాటిల్ అన్నారు. ఈ నిర్ణయంపై తాము బాధపడ్డామని, కానీ, స్వీకరించామని చెప్పారు.
ఈ నిర్ణయంపై తాము కలత చెందామని రాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ అన్నారు. కానీ, తమ బాధను లోపలే దాచుకుని ముందుకు అడుగు వేశామని వివరించారు. ఎందుకంటే ముందడుగు వేయక తప్పదు కదా అని పేర్కొన్నారు.
శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ వంటి విరుద్ధ భావజాలాలు గల పార్టీలు సంయుక్తంగా మహావికాస్ అఘాదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీని కాదని, వీటితో విరుద్ధ భావజాల పార్టీలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. దాదాపు రెండున్నరేళ్లకు పైగా మహావికాస్ అఘాదీ ప్రభుత్వం విజయవంతంగా కొనసాగింది. కానీ, సొంత పార్టీలోనే తిరుగుబాటు చేశారు. వారే బీజేపీతో చేతులు కలిపి ప్రస్తుతం ప్రభుత్వం నడుపుతున్నారు.
అయితే, ఈ ప్రభుత్వం ఎంతో కాలం సాగదని, త్వరలోనే కూలిపోతుందని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే పేర్కొనడం గమనార్హం. ఆయన వ్యాఖ్యలు చేసిన రోజే చంద్రకాంత్ పాటిల్ తన అసహనాన్ని బయటపెట్టారు.
