భారత్ లో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కేవలం ఆగస్టు నెలలోనే భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద హాట్ స్పాట్ గా మారింది. ఈ నెలలో దేశంలో కొత్తగా అత్య‌ధిక‌ కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య యూఎస్, బ్రెజిల్‌లను దాటింది. కరోనా మ‌ర‌ణాల విషయంలో ఆగస్టు మొదటి 6 రోజుల్లో భారతదేశం ప్రపంచంలో మూడవ స్థానానికి చేరుకుంది. 

శుక్రవారం కొత్త‌గా 60 వేల‌కు పైగా కరోనా కేసులు న‌మోద‌య్యాయి. 926 మంది మృతి చెందారు. ఆగస్టు నెల మొదటి 6 రోజుల్లో దేశంలో కొత్త‌గా 3,28,903 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అమెరికాలో ఇదే స‌మ‌యంలో ఈ సంఖ్య 3,26,111గా ఉండ‌గా,  బ్రెజిల్‌లో కొత్తగా 2,51,264 కేసులు న‌మోద‌య్యాయి. శుక్రవారం మహారాష్ట్రలో 10,000 కి పైగా క‌రోనా కేసులు నమోదయ్యాయి, 300 మందికి పైగా మరణించారు. 

దీంతో మహారాష్ట్రలో మొత్తం ఇన్‌ఫెక్షన్ల సంఖ్య 4,90,262 కు పెరిగింది. ఇక్కడ 17 వేల మందికి పైగా మరణించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒకే రోజులో అత్యధికంగా 89 మంది మరణించారు, కొత్త‌గా 10,171 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దేశంలో 2 లక్షల మార్కును దాటిన మూడవ రాష్ట్రంగా ఏపీ న‌మోద‌య్యింది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఇన్‌ఫెక్షన్ల సంఖ్య 2,06,960 గా ఉంది. ఇది మహారాష్ట్ర, తమిళనాడుల కంటే తక్కువ. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు 1800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.