కరోనా వైరస్ ఎప్పుడు... ఎలా సోకుతుందో తెలియదు. చిన్నపాటి అజాగ్రత్త ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తోంది. అందుకే బయటకు వెళ్లేటప్పుడు కానీ ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కానీ జాగ్రత్తలు తీసుకోవాలి.

ఈ క్రమంలో ఓ వ్యక్తి ద్వారా 104 మందికి వైరస్ సోకడం తమిళనాడులో సంచలనం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే.. తిరుచ్చిలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ రోడ్‌లోని ఓ జ్యూవెలరీ షాపులో పనిచేసే ఓ వ్యక్తికి జూన్ 22న కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది.

Also Read:33 గంటలపాటు లాక్‌డౌన్.. దక్కని ఫలితం: బెంగళూరులో 10 వేలు దాటిన కేసులు

అయితే ముందు జాగ్రత్తగా ఆ స్టోర్‌లో అతనితో పాటు పనిచేసే 303 మంది సిబ్బంది సహా వారి కుటుంబసభ్యులకు పరీక్షలు నిర్వహించగా 104 మందికి వైరస్ సోకినట్లు తేలింది. వీరిలో దాదాపు అందరూ తురైయూర్, తాలూకాల గ్రామాలకు చెందినవారే.

కేవలం 13 రోజుల వ్యవధిలోనే ఈ రెండు గ్రామాల్లో కరోనా కేసులు పది రెట్లు పెరిగాయి. జూన్ 22 వరకు 10 కోవిడ్ కేసులు ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 108కి చేరింది. వీరిలో నలుగురు మినహా అందరూ జ్యూవెలరీ షాపుకు సంబంధించినవారే కావడం గమనార్హం.

అయితే షాపు యాజమాన్యంపై స్థానికులు, కుటుంబసభ్యులు మండిపడుతున్నారు. మొదటి కేసు నమోదు కాగానే మిగిలిన సిబ్బందిని క్వారంటైన్‌కు పంపకుండా, విధులు కేటాయించారనే వాదనలు వినిపిస్తున్నాయి.

Also Read:ఒక్క రోజులోనే 22,252 కరోనా కేసులు: ఇండియాలో మొత్తం 7,19,665కి చేరిక

దీంతో అప్రమత్తమైన అధికారులు ఎస్ఎస్‌బీ రోడ్‌లోని మిగిలిన దుకాణాలను కూడా రెండు వారాల పాటు మూసివేయాలని ఆదేశించడంతో పాటు ఆ ప్రాంతాన్ని హాట్‌స్పాట్‌గా ప్రకటించింది.

కాగా సోమవారం తమిళనాడులో 3,827 కరోనా కేసులు నమోదు కావడంతో అక్కడ మొత్తం కేసుల సంఖ్య 1,14,978కి చేరింది. అలాగే సోమవారం ఒక్కరోజే 61 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోవడంతో.. ఇప్పటి వరకు మొత్తం మరణాల సంఖ్య 1,571కి చేరింది. ప్రస్తుతం తమిళనాడులో 46,883 యాక్టివ్ కేసులు ఉన్నట్లుగా ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.