Asianet News TeluguAsianet News Telugu

ఉద్యోగులకు షాకిచ్చిన ‘విప్రో’.. సడెన్ గా 300 మంది ఉద్యోగుల తొలగింపు.. కారణమేమిటంటే..?

ఒకే సమయంలో రెండు ఉద్యోగాలు (మూన్‌లైటింగ్)చేస్తున్న 300 మంది ఉద్యోగులను ఐటీ దిగ్గజం విప్రో తొలగించింది. ఒక ఉద్యోగి తన రెగ్యులర్ ఉద్యోగంతో పాటు ఇతర ప్రదేశాలలో రహస్యంగా పని చేస్తే, దానిని సాంకేతికంగా మూన్‌లైటింగ్' అంటారు.మూన్ లైటింగ్‌పై విప్రోతో పాటు ఇన్ఫోసిస్‌, ఐబీఎం సంస్థ‌లు హెచ్చరికలు జారీ చేశాయి. 

Wipro fires 300 employees for moonlighting
Author
First Published Sep 22, 2022, 12:30 AM IST

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ విప్రో లిమిటెడ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకే సమయంలో రెండు ఉద్యోగాలు   చేసే ఉద్యోగులపై వేటు వేసింది. తన సంస్థలో పనిచేస్తూ.. అదే సమయంలో మరో సంస్థ‌కు  ప‌నిచేసున్న దాదాపు 300మంది ఉద్యోగుల‌పై వేటు ప‌డేలా చేసింది.వారిని వెంటనే ఉద్యోగంలో నుంచి తొలగిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విష‌యాన్ని విప్రో చైర్మ‌న్ రిష‌ద్ ప్రేమ్‌జీ స్వ‌యంగా వెల్ల‌డించారు. 

బుధవారం జరిగిన ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (AIMA) జాతీయ సదస్సులో ప్రేమ్‌జీ మాట్లాడుతూ..  మూన్‌లైటింగ్ చేయడమంటే.. కంపెనీ పట్ల విధేయతను పూర్తిగా ఉల్లంఘించడమేననీ పేర్కొన్నారు. విప్రోలో పనిచేస్తున్నప్పుడు ప్రత్యర్థి కంపెనీలతో పనిచేసే ఉద్యోగులకు కంపెనీలో చోటు లేదని 'మూన్‌లైటింగ్'కు వ్యతిరేకంగా స్టాండ్ తీసుకున్న విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ అన్నారు. నేడు విప్రోతో పాటు ప్రత్యర్థి కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తులు ఉన్నారనేది వాస్తవమని ఆయన అన్నారు. వాస్తవానికి దీన్ని చేస్తున్న 300 మంది ఉద్యోగులను తాము గత  కొన్ని నెలల్లో గుర్తించామని తెలిపారు. 300 మంది ఉద్యోగులపై తీసుకున్న చర్యల గురించి ప్రశ్నించగా.. ఈ ఉల్లంఘన కేసుల్లో ఉద్యోగుల సర్వీసులను ‘టెర్మినేట్‌’ చేశామని చెప్పారు.

సాధారణ పని గంటల తర్వాత కార్మికులు ఇతర ఉద్యోగాలకు వెళ్లడం వల్ల పని ఉత్పాదకతపై ప్రభావం చూపుతుందని, వైరుధ్యాలు,డేటా ఉల్లంఘనలకు దారితీయవచ్చని ఐటీ కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి.
విప్రో చీఫ్ మూన్‌లైటింగ్‌ను ప్రారంభించినప్పటి నుండి తీవ్రంగా విమర్శిస్తున్నారు. దానినిమోసంగా పోల్చారు.

గత నెలలో ఆయన ట్విటర్‌లో పోస్టు చేస్తూ..  ఐటీ కంపెనీల్లోని ఉద్యోగులను మూన్ లైటింగ్ చేయడంపై చాలా చర్చలు జరుగుతున్నాయనీ, ఇది కంపెనీకి ప్రత్యక్ష,స్పష్టమైన ద్రోహమని తెలిపారు.

ఇదే సమయంలో మూన్ లైటింగ్ విషయంలో ఇన్ఫోసిస్ కూడా తన ఉద్యోగులను హెచ్చరించింది. తమ కంపెనీలో  పనిచేస్తూ.. ఇతర కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఇది కాకుండా ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ఐబీఎం కూడా 'మూన్‌లైటింగ్' అనైతికమని పేర్కొంది.IBM మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పటేల్ గత వారం ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఉద్యోగులు తమ విశ్రాంతి సమయంలో వారు కోరుకున్నది చేయగలరని, అయితే మూన్‌లైట్ చేయడం నైతికమైనది కాదని అన్నారు.

అయితే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలోని అన్ని కంపెనీలు ఈ సమస్యను అంగీకరించవు. టెక్ మహీంద్రా మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించింది.టెక్ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నానీ ఇటీవల ట్వీట్ చేస్తూ.. "కాలానికి అనుగుణంగా మారడం చాలా ముఖ్యం. మనం పని చేసే విధానంలో మార్పును నేను స్వాగతిస్తున్నాను" అని ట్వీట్ చేశారు.

క‌రోనా సమయంలో చాలా ఐటీ సంస్థలు వ‌ర్క్ ఫ్రం హోం పధ్ధతి అమ‌లులోకి తీసుకవచ్చిన విషయం తెలిసిందే.. అయితే..ఉద్యోగుల ప‌నివేళ‌ల్లో పూర్తి స్థాయిలో మార్పులు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.సమయంలో ఇంటి వ‌ద్ద నుంచే ప‌నిచేస్తున్న కొంద‌రు ఉద్యోగులు.. తాము ప‌నిచేస్తున్న సంస్థ‌ల‌కు తెలియ‌కుండా ఖాళీ స‌మ‌యాల్లో ఇత‌ర సంస్థ‌ల్లో పని చేయడం స్టార్ చేశారు. ఈ పద్ధతినే మూన్ లైటింగ్ అని పిలుస్తున్నారు. ఈ పద్దతిని అనైతికమని పలు కంపెనీలు త‌మ ఉద్యోగుల‌కు ఇప్ప‌టికే హెచ్చ‌రించిన సంగ‌తి తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios