Delhi: డిసెంబర్ 7 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి శుక్రవారం తెలిపారు. అలాగే, హైదరాబాద్ లో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసంపై దాడికి ఖండిస్తూ తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
Parliament winter session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 7 నుంచి ప్రారంభమై డిసెంబర్ 29 వరకు కొనసాగుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ క్రమంలోనే ఆయన అలాగే, హైదరాబాద్ లో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసంపై దాడికి ఖండించారు. తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్, వారి కుటుంబాలు, మరికొందరు మంత్రులు ధనవంతులు అయ్యారనీ, రాష్ట్రం, ప్రజలు రోజురోజుకు పేదలుగా మారుతున్నారని ఆయన ఆరోపించారు.
వివరాల్లోకెళ్తే.. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 7న ప్రారంభమై 29 వరకు కొనసాగుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి శుక్రవారం తెలిపారు. ట్విట్టర్ వేదికగా పార్లమెంట్ సమావేశాల గురించి వివరాలు వెల్లడించారు. ఒక ట్వీట్‌లో " పార్లమెంటు శీతాకాల సమావేశాలు 2022 డిసెంబర్ 7 నుండి ప్రారంభమై డిసెంబర్ 29 వరకు కొనసాగుతాయి. 23 రోజుల పాటు 17 సమావేశాలు జరుగుతాయి. అమృత్ కల్ సెషన్ సమయంలో లెజిస్లేటివ్ బిజినెస్, ఇతర అంశాలపై చర్చల కోసం ఎదురు చూస్తున్నారు. నిర్మాణాత్మక చర్చ కోసం ఎదురు చూస్తున్నాను" అని అన్నారు.
కాగా, శీతాకాలపు పార్లమెంట్ సెషన్ సాధారణంగా ప్రతి సంవత్సరం నవంబర్ మూడవ వారంలో ప్రారంభమవుతుంది, కానీ ఈసారి అది డిసెంబర్ నెలలో ప్రారంభమవుతుంది. పాత భవనంలో సభ జరిగే అవకాశం ఉండగా, ఈ నెలాఖరులోగా లేదా డిసెంబర్ ప్రారంభంలో రూ. 1,200 కోట్లకు పైగా అంచనా వ్యయంతో నిర్మించిన కొత్త భవనాన్ని లాంఛనప్రాయంగా ప్రారంభించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సంబంధిత ప్రభుత్వ వర్గాల ప్రకారం.. 2023 మొదటి పార్లమెంట్ సమావేశాలు, అంటే బడ్జెట్ సమావేశాలు కొత్త పార్లమెంట్ భవనంలో నిర్వహించబడతాయి.
బీజేపీ పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా ఇవాళ తెలంగాణలో ఉన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ నివాసం పై పలువురు వ్యక్తులు దాడి చేసిన ఘటనను ఆయన ఖండించారు. టీఆర్‌ఎస్ ఈ వైఖరిని, గూండాయిజాన్ని, ప్రజాప్రతినిధులను బెదిరిస్తూ బీజేపీకి మద్దతిస్తున్న వారిని కూడా బెదిరింపులకు గురిచేస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన విలేకరులతో అన్నారు. గతంలో తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఉండేదని పేర్కొన్న ఆయన.. ఇప్పుడు అప్పుల రాష్ట్రంగా మారిందని ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్, వారి కుటుంబాలు, మరికొందరు మంత్రులు ధనవంతులు అయ్యారనీ, రాష్ట్రం, ప్రజలు రోజురోజుకు పేదలుగా మారుతున్నారని ఆయన ఆరోపించారు.
