నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన రేపటితో ముగియనుంది. కేంద్ర ప్రభుత్వం రైతుల డిమాండ్లకు ఒప్పుకోవడంతో రేపటి నుంచి రైతులు ఇళ్లకు వెల్లిపోనున్నారు.
పట్టుపట్టరాదు..పట్టి విడువరాదు అనే నానుడిని ఒంట పట్టించుకొని విజయం సాధించే వరకు ఆందోళన విరమించలేదు రైతులు. తమకు పొలాలు దున్ని పంట తీయడమే కాదు.. అన్యాయాన్ని ఎదురించి న్యాయం పొందటం కూడా తెలుసని నిరూపించారు. నూతన సాగు చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత ఏడాదిన్నరగా సాగుతున్న రైతు ఆందోళనలు రేపటితో ముగియనున్నాయి. ఢిల్లీ సరిహద్దులను విడిచి రేపటి నుంచి రైతులు ఇళ్లకు వెళ్లిపోనున్నారు.
ఎన్ని సవాళ్లు ఎదురైనా..
గతేడాదిలో కేంద్ర ప్రభుత్వం మూడు నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది. ఈ చట్టాలతో ఉపయోగం ఉండకపోగా తీవ్ర నష్టం జరుగుతుందని, ఇది రైతులకు కాకుండా కార్పోరేట్ శక్తులకు ఉపయోగకరంగా ఉంటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై పోరాడటానికి 40 రైతు సంఘాలు కలిసి సంయుక్త కిసాన్ మోర్చాగా ఏర్పడ్డాయి. రైతు సంఘాలన్నీ ఒకేతాటిపైకి వచ్చి ఢిల్లీ బార్డర్‌లో నిరసలు చేపట్టాయి. గత ఏడాది ఆగస్టు నుంచి ఈ నిరసనలు ప్రారంభమయ్యాయి. వివిధ దశల్లో రైల్ రోకోలు, శాంతియుత ర్యాలీలు చేపట్టారు. ఈ ఉద్యమంలో ఎన్ని సవాళ్ల ఎదురైనా వెన్నుచూపలేదు. ఢిల్లీ సరిహద్దుల్లో తీవ్రమైన చలిలో కూడా నిరసనలు ఆపలేదు. అక్కడే గుడారాలు వేసుకొని ఉన్నారు. పండగలకు కూడా ఇంటికి వెళ్లలేదు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసేంత వరకు ఆందోళన విరమించేది లేదని ఖరాఖండీగా చెప్పారు.
సవరణలు చేస్తామని చెప్పినా.. రద్దుకే రైతుల మొగ్గు..
రైతులు చేస్తున్న ఆందోళనకు ప్రభుత్వం దిగివచ్చింది. ఈ నేపథ్యంలో రైతు సంఘాల నాయకులను చర్చలకు పిలిచింది. చట్టాలు రద్దు చేయడం కుదరదని అవసరమైతే కొన్ని మార్పులు తీసుకొస్తామని ప్రభుత్వం సూచించింది. అయినా రైతులు దానికి ఒప్పుకోలేదు. కొత్త చట్టాలని రద్దు చేయాల్సిందే అని తేల్చి చెబుతూ వచ్చారు. ఇలా 11 సార్లు కేంద్ర ప్రభుత్వం రైతులతో సంప్రదింపులు జరిపింది. రైతులతో జరిపిన ఈ 11 చర్చలన్నీ విఫలమయ్యాయి. ప్రభుత్వం ఎన్ని ప్రత్యామ్నాయాలు చూపించినా రైతులు ఒప్పుకోలేదు. కొత్త సాగు చట్టాలు రద్దు చేస్తేనే ఆందోళనలు విరమిస్తామని తేల్చి చెప్పారు. చివరికి ప్రభుత్వం దిగిరాక తప్పలేదు.
దిగివచ్చిన అన్నదాతలు.. రెండ్రోజుల్లో ఢిల్లీని ఖాళీ చేస్తామన్న రాకేశ్ టికాయత్
పోరాటంలో 700 మంది రైతులు మృతి..
రైతుల విజయం సులభంగా ఏమీ దక్కలేదు. ఎన్ని అడ్డకుంలు ఎదురైనా పోరాటాన్ని ఆపలేదు. ఈ ఆందోళనల్లో 700 మంది మృతి చెందారు. 9 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్‌లో జరిగిన ఘటన దేశాన్ని ద్రిగ్భాంతికి గురి చేసింది. ఇలా ఎన్నో ఘటనలు చోటు చేసుకున్నాయి. చివరికి ప్రభుత్వం రైతుల దిగివచ్చింది. రైతులు కోరకుంటున్నట్లు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించింది. కొత్త చట్టాలు రైతుల మేలు కోసమే తీసుకొచ్చామని.. కానీ వాటిని రైతులకు సరిగా వివరించలేకపోయామని ప్రధాని తెలిపారు. రైతులకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నామని తెలిపారు.
చట్టాల రద్దు బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..
శీతాకాల పార్లమెంటు సమావేశం ప్రారంమైన మొదటి రోజుల్లోనే నూతన వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. మూజువాణి ఓటుతో దానిని ఆమోదింపజేసుకుంది. దీంతో రైతుల ఆందోళనకు ఫలితం దక్కినట్టైంది. అయినా రైతులు ఆందోళన విరమించలేదు. కనీస మద్దతు ధర, ఇతర డిమాండ్లకు ప్రభుత్వం ఒప్పుకుంటే నిరసన విరమిస్తామని చెప్పారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం నిన్న క్లారిటీ ఇచ్చింది. కనీస మద్దతు ధర కోసం కమిటీ ఏర్పాటు చేస్తున్నామని, రైతులపై ఉన్న కేసులు ఎత్తివేస్తామని అలాగే మృతి చెందిన రైతులకు పంజాబ్, హర్యాన రాష్ట్రాలు నష్టపరిహారం అందిస్తాయని తెలిపింది. దీంతో సంతృప్తి చెందిన సంయుక్త కిసాన్ మోర్చా ఆందోళన విరమిస్తున్నట్టు ప్రకటించింది. జవనవరి 15న మరో సారి
భేటీ అయి అప్పటి పరిణామాల్ని బట్టి కార్యాచరణ వెల్లడిస్తామని తెలిపింది.
