కేరళలో ఓ బస్సు డ్రైవర్ సాహసం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అతను అడవి ఏనుగును ఎదుర్కొన్న తీరు ప్రశంసల జల్లు కురిపిస్తోంది. 

కేరళ : కేరళలో ఓ బస్ డ్రైవర్ అడవి ఏనుగును ఎదుర్కొన్న ఘటన సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోను బస్సులోని ప్రయాణీకులలో ఒకరు చిత్రీకరించారు. ఏనుగు బస్సును "తాకినప్పుడు".. బస్సు విండ్‌షీల్డ్ పగులగొట్టడానికి ప్రయత్నించడం కనిపిస్తుంది. 

మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహుతో సహా పలువురు ట్విట్టర్ యూజర్లు షేర్ చేశారు. “ఈ గవర్నమెంట్ బస్సు డ్రైవర్ ఎవరో తెలియదు.. కానీ, అతను ఖచ్చితంగా మిస్టర్ కూల్. ఏనుగు వచ్చినప్పుడు అదరలేదు, బెదరలేదు.. కంగారు పడి ఏమీ తలకిందులు చేయలేదు. అది రోజువారీ తన దినచర్యలాగా.. ఆ ఎలిఫెంట్ ను ప్రశాంతంగా చూస్తున్నాడు. ఈ వీడియోను కె.విజయ్ షేర్ చేశారు.. అని తమిళనాడులోని పర్యావరణ వాతావరణ మార్పు, అడవుల అదనపు ముఖ్య కార్యదర్శి సాహు తన పోస్ట్‌లో తెలిపారు.

స్థానిక మీడియా కథనం ప్రకారం, బస్సు మున్నార్‌కు వెళ్తుండగా సాయంత్రం 4 గంటలకు ఈ ఘటన జరిగింది. వీడియోలో చూసినట్లుగా, డ్రైవర్ రోడ్డుపై మలుపు తీసుకున్న వెంటనే, అక్కడ నిలబడి ఉన్న ఏనుగును చూశాడు. డ్రైవరు బస్సును ఆపేశాడు. అందులోని ప్రయాణీకులు తమ సెల్ ఫోన్లలో అడవి ఏనుగు ఫోటోలు, వీడియోలను తీసుకున్నాడు. 

ఏనుగు బస్సును గమనించి దానివైపు వస్తున్నప్పుడు అందులోని వారు ఉత్సాహంగా మాట్లాడుకుంటున్నారు. ఏనుగు దగ్గరికి వచ్చినప్పుడు, మాత్రం నిశ్శబ్దంగా మారిపోయాయి. ఏనుగు తన తొండం ఎత్తి బస్సు పైన అంతా పరిశీలించింది. ఈ క్రమంలో, దాని దంతాలు బస్సు విండ్‌షీల్డ్‌కు తగలడంతో అది పగుళ్లు ఏర్పడింది.

అయితే ఈ మొత్తం ఘటనలో.. డ్రైవర్ ఏ మాత్రం కంగారు లేకుండా.. ప్రశాంతంగా ఉన్నాడు. ఆ తరువాత ఏనుగు బస్సు నుండి దూరంగా వెడుతున్న క్రమంలో సందు దొరకడంతో, అతను బస్సును ముందుకు కదిలించాడు. అతను అలా ప్రశాంతంగా వ్యవహరించడం మీద అతనిపై ట్విట్టర్‌లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

“నిజంగా డ్రైవర్‌ దమ్మున్నోడు. నేనైతే ఇలా చేయను. భయంతో బిగదీసుకుపోతాను. కంగారులో ఏం చేసేవాడినో తెలీదు. ఎంత భయానకమైన పరిస్తితో.. చూడడానికి ఆ ఏనుగు అంత అందంగా కూడా ఉంది..’’ అని ఒక ట్విట్టర్ యూజర్ ట్వీట్ చేశారు.
ఈ వీడియో మీద కామెంట్స్ చేసిన చాలా మంది కేరళకు చెందినవారే. అడవి జంతువును “పడయప్ప” అని పిలుస్తారు. అందుకే తమ వ్యాఖ్యలలో కూడా అవే హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించారు. ఐఏఎస్ అధికారి పోస్ట్ చేసిన వీడియోను 15,000 మందికి పైగా వీక్షించారు.


Scroll to load tweet…