న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తనకు విధించిన జరిమానాను చెల్లిస్తానని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ప్రకటించారు.

కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారనే కేసులో సోమవారం నాడు ప్రశాంత్ భూషణ్ కు సుప్రీంకోర్టు ఒక్క రూపాయి జరిమానాను విధించింది. ఈ తీర్పు వెలువడిన తర్వాత ప్రశాంత్ భూషణ్ మీడియాతో మాట్లాడారు. తన సీనియర్ న్యాయవాది రాజీవ్ ధవన్ తనకు ఒక్క రూపాయి ఇచ్చారని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

ప్రశాంత్ భూషణ్ ను దోషిగా ఈ నెల 14వ తేదీన సుప్రీంకోర్టు నిర్ధారించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇవాళ ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.సెప్టెంబర్ 15 లోపుగా చెల్లించకపోతే మూడు నెలల జైలు శిక్షతో పాటు న్యాయవాద వృత్తి నుండి సస్పెండ్ చేస్తామని సుప్రీం కోర్టు తెలిపింది.

సుప్రీంకోర్టును కించపర్చేలా తాను ట్వీట్లు చేయలేదని ఆయన ప్రకటించారు. న్యాయ వ్యవస్థపై గౌరవం ఉందని ఆయన చెప్పారు.సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసే హక్కుందన్నారు. అయితే రివ్యూ పిటిషన్ దాకలు చేసే విషయమై ఆయన స్పష్టత ఇవ్వలేదు.