ఇంటి వద్దే ఉండే తల్లులకు యేటా రూ. 20 వేలు అందిస్తామని, అలాగే, తొమ్మిదో తరగతి, ఆపై చదువుకునే అమ్మాయిలు ఉచితంగా శానిటరీ నాప్కిన్స్ అందిస్తామని సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ వెల్లడించారు. ఈ పథకం ప్రస్తుత ఏడాది నుంచే అమలు చేస్తామని, ఇందుకోసం బడ్జెట్‌లో రూ. 100 కోట్లను కేటాయించినట్టు వివరించారు.

గువహతి: సిక్కిం (Sikkim) ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ఉద్యోగం, ఉపాధి చేయకుండా ఇంటి వద్దే ఉండే తల్లులకు యేటా రూ. 20 వేలు అందిస్తామని సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ వెల్లడించారు. అలాగే, తొమ్మిదో తరగతి, ఆపై చదివే అమ్మాయిల(Girls)కు ఉచితంగా శానిటరీ నాప్కిన్స్ అందిస్తామని ప్రకటించారు. సిక్కిం రాష్ట్ర సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ (CM Prem Singh Tamang) శుక్రవారం మెల్లిలో నిర్వహించిన ఓ ఫంక్షన్‌లో ఆయన మాట్లాడారు.

ఇంటి వద్దే ఉండే తల్లుల కోసం తమ రాష్ట్ర ప్రభుత్వం ఆమ యోజనను, ఆడ పిల్లల కోసం బహిని స్కీమ్‌ను అమలు చేస్తుందని సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ తెలిపారు. ఆమ యోజన కింద పని చేయకుండా ఇంటివద్దే ఉండాల్సి వస్తున్న తల్లులకు ఏడాదికి ఒకసారి రూ. 20 వేలు అందిస్తామని వివరించారు. ఈ డబ్బులు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని పేర్కొన్నారు. అయితే, ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్న ఈ తల్లులకు మాత్రమే డబ్బులు అందుతాయని తెలిపారు. ఈ పథకాన్ని ఈ ఏడాది నుంచే అమలు చేస్తామని వెల్లడించారు. ఈ పథకానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు, పద్ధతులపై సమాలోచనలు జరుగుతున్నాయని వివరించారు. 

ఈ పథకం కోసం తమ ప్రభుత్వం రూ. 100 కోట్లు బడ్జెట్‌లో కేటాయించామని తెలిపారు. ఈ పథకం ఇంటి వద్దే ఉండే తల్లుల్లో పొదుపు గుణాన్ని మరింత పెంచవచ్చునని వివరించారు. కాగా, బహిని స్కీమ్‌ కింద రాష్ట్రంలోని తొమ్మిదో తరగతి, ఆపై చదువుతున్న బాలికలు అందరికీ ఉచితంగా శానిటరీ నాప్కిన్స్ అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 18వేలకు మించి తొమ్మిదో తరగతి, ఆ పై తరగతులు చదువుతున్న బాలికలు ఉన్నారు.

అంతేకాదు, పాఠశాలల్లోనే శానిటరీ నాప్కిన్స్ వెండింగ్ మెషీన్లు ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వం భావిస్తున్నది. వీటితోపాటు పీరియడ్స్‌పై పిల్లల్లో అవగాహన పెంపొందించాలనీ యోచిస్తున్నది.

ఇదిలా ఉండగా, మాతా శిశు ఆరోగ్య సేవలను మెరుగుపరచడంతో పాటు గర్భిణీలు ప్రభుత్వ ఆస్పత్రులను ఎంచుకునేలా ప్రోత్సహించేందుకు తెలంగాణ స‌ర్కారు చేప‌ట్టిన "కేసీఆర్ కిట్ల పథకం" మ‌రో వైలురాయిని అందుకుంది. తల్లులకు, వారి నవజాత శిశువులకు ఇప్ప‌టివ‌ర‌కు తెలంగాణ ప్ర‌భుత్వం 10 లక్షల కేసీఆర్ కిట్‌లను పంపిణీ చేసిందని అధికార వ‌ర్గాలు పేర్కొన్నాయి. ముఖ్య‌మంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ స‌ర్కారు 2017 జూన్‌లో ప్రారంభించిన ఆర్థిక ప్రయోజనాలతో కూడిన ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 10,82,684 కేసీఆర్ కిట్‌లను అందించారు. వీటిని ప్రభుత్వ ఆస్పత్రులను ప్ర‌స‌వాల‌కు ఎంచుకున్న వారికి అందిస్తున్నారు. 

ఈ " కేసీఆర్ కిట్‌లను పంపిణీ" ప‌థ‌కంలో భాగంగా గర్భిణీ స్త్రీలకు మగబిడ్డ పుడితే 12,000 రూపాయ‌లు, ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయ‌లు ఆర్థిక ప్రయోజనానాలు అందిస్తున్నారు. ఈ పథకంలో భాగంగా 2017 నుంచి 2022 మధ్య ఇప్పటి వరకు 14,17,816 మంది గర్భిణులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల‌కు స‌హ‌కారం అందించారు. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో ప్ర‌స‌వాల‌ను ప్రొత్స‌హిస్తూ.. వారికి మెరుగైన సేవ‌లు అందించ‌డానికి ప్ర‌భుత్వం ఈ ప‌థ‌కం తీసుకువ‌చ్చింది. ఈ స్కీమ్ ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి రాష్ట్రంలోని మొత్తం గ‌ర్భిణీల‌లో 55 శాతం మంది ప్ర‌యివేటు ఆస్ప‌త్రుల‌ను కాద‌ని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌ను ప్ర‌స‌వాల కోసం ఎంచుకున్నారు. ప్ర‌స‌వాల విష‌యంలో ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులు.. ప్ర‌యివేటు ఆస్ప‌త్రుల కంటే మెరుగైన ప‌నితీరును కొన‌సాగిస్తూ ముందుకు సాగుతున్నాయ‌ని స్ప‌ష్ట‌మ‌వుతున్న‌ది.