Asianet News TeluguAsianet News Telugu

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఆ పార్టీలతో పొత్తుపెట్టుకునే ఆలోచనే లేదు: కాంగ్రెస్ స్పష్టీకరణ

వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అటు ఎస్పీ లేదా ఇటు బీఎస్పీలతో పొత్తుకట్టే ఆలోచనలే లేవని స్పష్టం చేసింది. వచ్చే ఎన్నికల్లో చిన్నపార్టీలతోనే జతకడతామని పార్టీ యూపీ యూనిట్ చీఫ్ అజయ్ కుమార్ లల్లూ వివరించారు. ప్రియాంక గాంధీ వాద్రా సారథ్యంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీపై దీటుగా పోరాడతామని, వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్‌దేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
 

will not tie up with big parties but only small parties congress clarifies its strategy in upcoming uttarpradesh assembly elections
Author
Lucknow, First Published Sep 5, 2021, 3:40 PM IST

లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లు వచ్చే ఏడాది తొలినాళ్లలో జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పార్టీలు కసరత్తులు ప్రారంభించాయి. తమ అజెండాను స్పష్ట చేసుకుంటూ పొత్తులపైనా క్లారిటీనిస్తున్నాయి. ఇప్పటికే బీఎస్పీ సోలోగా ఫైట్ చేస్తుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) కూడా పెద్దపార్టీలతో కాదు.. చిన్నపార్టీలతోనే పొత్తులు పెట్టుకుంటామని వెల్లడించింది. తాజాగా కాంగ్రెస్ కూడా వచ్చే ఎన్నికల్లో పొత్తుపై ఓ నిర్ణయాన్ని తెలిపింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాము పెద్ద పార్టీలతో పొత్తు పెట్టుకునే ఆలోచనలే చేయబోమని స్పష్టం చేసింది. చిన్నపార్టీలతో జట్టుకడతామని వివరించింది. దీంతో ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌ల పొత్తు లేదని స్పష్టమైపోయింది.

కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్ యూనిట్ చీఫ్ అజయ్ కుమార్ లల్లూ పార్టీ పొత్తులపై క్లారిటీనిచ్చారు. వచ్చే ఎన్నికల్లో పెద్దపార్టీలతో పొత్తుపెట్టుకునే ఆలోచనలే చేయడం లేదని అన్నారు. గత 32 ఏళ్ల బీజేపీ, బీఎస్పీ పాలనలో ప్రజల సంక్షేమం గాల్లో కలిసిందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు సామాన్య పౌరుల కలలు కల్లలయ్యాయని తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్సే ఉన్నదని లల్లూ స్పష్టం చేశారు. బీజేపీకి దీటైన పోటీనిచ్చే పార్టీ ఎస్పీ అని వాదనలు వస్తున్నాయని, కానీ, అదంతా మీడియా సృష్టి అని కొట్టిపారేశారు. వచ్చే ఎలక్షన్స్‌లో బీజేపీకి సవాల్ విసిరే పార్టీ కాంగ్రెస్సే అని వివరించారు. ప్రియాంక గాంధీ వాద్రా సారథ్యంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని, వచ్చే ప్రభుత్వం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. నేడు ప్రతి సమస్యపైనా ప్రియాంక గాంధీ వాద్రా వేగంగా స్పందిస్తున్నారని, కాంగ్రెస శ్రేణులన్నీ ఆమె వెంటే ఉన్నాయని వివరించారు.

ఇప్పటికే ఎస్పీ, బీఎస్పీలు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే ఆలోచనల్లేవని స్పష్టం చేశాయి. బీఎస్పీ ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోరాడనున్నట్టు ప్రకటించింది. ఎస్పీ మాత్రం తాము చిన్నపార్టీలతో జతకడుతామని వివరించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ప్రీఫైనల్‌గా బీజేపీవర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్టు సమాచారం.

Follow Us:
Download App:
  • android
  • ios