మోడీ ఇంటి పేరు కేసులో తాను క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని రాహుల్ గాంధీ తాజాగా సుప్రీంకోర్టుకు తెలియజేశారు. తాను ఏ తప్పూ చేయలేదని, కాబట్టి, క్షమాపణలు చెప్పనని వివరించారు. నేర నిర్దారణపై స్టే ఇచ్చి పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనడానికి అవకాశం కల్పించాలని కోరారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం సుప్రీంకోర్టులో మోడీ ఇంటి పేరుకు సంబంధించిన కేసులో అఫిడవిట్ ఫైల్ చేశారు. ఈ అఫిడవిట్‌లో కీలక విషయాలు పేర్కొన్నారు. ఈ కేసులో నేరనిర్దారణకు రద్దు చేయాలని, రెండేళ్ల జైలు శిక్షను రద్దు చేయాలని కోరారు. తద్వార తనను పార్లమెంటులో జరుగుతున్న సమావేశాల్లో పాల్గొనడానికి అనుమతి ఇవ్వాలని తెలిపారు. తాను నేరం చేయలేదని వివరించారు. అందుకే తాను క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఒక వేళ తాను క్షమాపణలు చెప్పాలనే అనుకుంటే ఎన్నడో చెప్పేవాడినని వివరించారు.
2019 ఏప్రిల్‌లో కర్ణాటటకలోని కోలార్‌లో ఓ ఎన్నికల ప్రచార కార్యకర్మంలో ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ విమర్శలు కురిపించారు. నరేంద్ర మోడీని టార్గెట్ చేసుకుంటూ దొంగలందరికీ మోడీ ఇంటి పేరే ఎందుకు ఉన్నదంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గుజరాత్ ఎమ్మెల్యే పూర్ణేశ్ ఇశ్వర్ భాయ్ మోడీ కేసు వేశారు. సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేలుస్తూ గరిష్ట శిక్ష రెండేళ్ల జైలుకు శిక్షను వేసింది. దీంతో రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్నీ కోల్పోవాల్సి వచ్చింది.
ఈ కేసులో సోమవారం పూర్ణేశ్ మోడీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేశారు. అందులో రాహుల్ గాంధీ ఒక సముదాయాన్ని గాయపరిచారని, అందుకు పశ్చాత్తాపాన్ని ప్రకటించకుండా అహంభావిగా వ్యవహరించారని పేర్కొన్నారు. ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తాను క్షమాపణలు చెప్పబోనని, తాను సావర్కర్‌ను కాదని, గాంధీనని చెప్పినట్టు వివరించారు. ఆయనలో పశ్చాత్తాపం లేనందున శిక్షను రద్దు చేయరాదని కోరారు.
Also Read: అన్నదాతలకు కేసీఆర్ గుడ్‌న్యూస్.. రేపటి నుంచి రైతు రుణమాఫీ, అధికారులకు కీలక ఆదేశాలు
తాజాగా, రాహుల్ గాంధీ దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఈ విషయాన్ని పేర్కొన్నారు. తాను క్షమాపణలు చెప్పనందునే వారు అహంభావి అని ముద్ర వేశారని తెలిపారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, అయినా, బలవంతంగా తనతో క్షమాపణలు చెప్పితే అది తనకు అన్యాయం జరిగినట్టే అవుతుందని వివరించారు. తనతో క్షమాపణలు చెప్పించాలనే ప్రతిపాదనను కోర్టు తోసిపుచ్చుతుందని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.
రాహుల్ గాంధీపై వేసిన కేసు చాలా చిన్న ఉల్లంఘనకు సంబంధించినదని, కానీ, దాని ఆధారంగా ఒక ఎన్నికైన ఎంపీకి పూడ్చలేని నష్టాన్ని చేశారని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన వ్యాఖ్యలతో కంప్లైనెంట్‌కు ఓ మనోభావం దెబ్బతినే అవకాశమే లేదని, కాబట్టి, నేర నిర్దారణపై స్టే ఇవ్వాలని రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును కోరారు. తద్వార నేడు జరుగుతున్న, భవిష్యత్‌లో జరగనున్న పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
