కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై.. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్‌పై ప్రశంసలు కురిపించారు. కర్ణాటకలోనూ ఉత్తరప్రదేశ్ తరహా విధానాలు అమలు చేయడానికి వెనుకాడం అని వివరించారు.  

బెంగళూరు: కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మతపరమైన హింసను అరికట్టడానికి అవసరమైతే యోగి ఆదిత్యానాథ్ మోడల్ ఫాలో అవుతానని చెప్పారు. అవసరం పడితే.. యోగి ఆదిత్యానాథ్ మాడల్ కంటే కూడా మరింత కఠినమైన నిబంధనలు అమలు చేస్తానని వివరించారు. ఉత్తరప్రదేశ్‌ను హ్యాండిల్ చేయడానికి యోగి ఆదిత్యానాథే సరైన ముఖ్యమంత్రి అని ఆయన ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ అన్నారు. 

దక్షిణ కన్నడ జిల్లాలో బీజేపీ యువ మోర్చా నేత ప్రవీణ్ నెట్టారు హత్య జరిగిన తర్వాత బీజేపీ, సంఘ పరివార కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వానికి నిరసనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం హిందు కార్యకర్తల ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయడం లేదని ఆరోపించారు.

ఈ నిరసనల నేపథ్యంలో సీఎం బసవరాజు బొమ్మై ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇది వరకు తాను చెప్పానని, రాష్ట్రంలో కఠినమైన పాలన చేపట్టడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని, అవసరం అయితే యోగి ఆదిత్యానాథ్ మాడల్‌ కంటే కూడా కఠినమైన విధానాలను అమలు పరుస్తామని సీఎం తెలిపారు.

కర్ణాటకలో పరిస్థితులను హ్యాండిల్ చేయడానికి చాలా రకాల పద్ధతులు ఉన్నాయని సీఎం వివరించారు. వాటన్నింటినీ వినియోగిస్తున్నామని తెలిపారు. 

ఈ ఘటనలో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సవాళ్లను ఎదుర్కొని పరిష్కారాల దారిలో దింపిందని వివరించారు. హిజాబ్ వివాదం, అజాన్ చదవడం వంటి అంశాలను తాము విజయవంతంగా ఎదుర్కొన్నామని తెలిపారు.