Bengal-Bangladesh border: పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) అమలు చేస్తామని బెంగాల్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు సువేందు అధికారి అన్నారు. బెంగాల్-బంగ్లాదేశ్ సరిహద్దులోని ఠాకూర్ నగర్ లో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ ఆయన పై వ్యాఖ్యలు చేశారు.  

Bengal BJP MLA Suvendu Adhikari: దేశంలో పలు చోట్ల హింసాత్మక ఘటనలకు దారి తీసిన పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ)ను తప్పకుండా అమలు చేస్తామని బెంగాల్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు సువేందు అధికారి అన్నారు. బెంగాల్-బంగ్లాదేశ్ సరిహద్దులోని ఠాకూర్ నగర్ లో జరిగిన ఒక ర్యాలీలో రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అయిన సువేందు అధికారి పై వ్యాఖ్య‌లు చేశారు. అలాగే, జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సీ) కోసం కూడా ఆయ‌న పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో ఆయ‌న‌తో పాటు పార్ల‌మెంట్ స‌భ్యులు శంతను ఠాకూర్ కూడా ఉన్నారు. 

"పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ముందుకు సాగుతుంది. దీంతో పాటు ఎన్నార్సీ, జనాభా నియంత్రణ బిల్లును అమలు చేయాలని నేను వ్యక్తిగతంగా డిమాండ్ చేస్తున్నాను. ముస్లిములు, క్రైస్తవులకు అనేక దేశాలు ఉన్నాయి. కానీ హిందువుల స్వస్థలం ఒక్కటే ఉంది" అని బెంగాల్ బీజేపీ నాయ‌కుడు సువేందు అధికారి అన్నారు. అలాగే, సీఏఏను అమ‌లు చేస్తామ‌నీ, ఒక్క‌సారి ఆమోదం ల‌భించాక చ‌ట్టాన్ని ఏదీ ఆప‌లేద‌ని కూడా ఆయ‌న పేర్కొన్నారు. "సీఏఏను అమలు చేస్తాం. ఒకసారి ఒక చట్టాన్ని ఆమోదించిన తరువాత, దానిని అమలు చేయకుండా ఏదీ ఆపదు. ఏ ముఖ్యమంత్రి దాన్ని ఆపలేరు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది" అని ఆయ‌న అన్నారు. 

అలాగే, "100 ఏళ్ళ తర్వాత నువ్వు ఇక్కడ ఉండలేవు. ఒక నిర్దిష్ట సమయంలో భారతదేశానికి వచ్చిన శరణార్థులను రోహింగ్యాల వలె తరిమివేయాలని ఒక ప్రభుత్వం వచ్చి చెబితే, మీరు (ముఖ్యమంత్రి) నిరసన తెలపడానికి అక్కడ ఉంటారా?.." అని ప్ర‌శ్నించారు. సీఏఏ పౌరసత్వం ఇస్తుందనీ, దాన్ని తీసివేయదని సువేందు అధికారి పునరుద్ఘాటించారు.

Scroll to load tweet…


సీఏఏను అమ‌లు చేస్తాం.. : అమిత్ షా

అంత‌కుముందు ఓ మీడియా ఛానెల్ తో మాట్లాడిన కేంద్ర మంత్రి అమిత్ షా సైతం సీఏఏను అమ‌లు చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. సీఏఏకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిందనీ, చట్టాన్ని వెనక్కి తీసుకుంటామనీ లేదా అమలు చేయబోమని కలలు కనడం మానుకోవాలని ఆయ‌న అన్నారు. దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో జరిగిన టైమ్స్ నౌ సదస్సులో అమిత్ షా ప్రసంగిస్తూ, దేశవ్యాప్తంగా నిరసనలు, హింసకు దారితీసిన వివాదాస్పద చట్టం ఎన్ఆర్సీ, సీఏఏలను కోల్డ్ స్టోరేజీలో ఉంచలేదని గుర్తు చేశారు. కోవిడ్ -19 మహమ్మారి ప్రేరేపిత లాక్డౌన్లు సీఏఏ అమలు ప్రక్రియను ఆలస్యం చేశాయని, మిగిలిన ఫార్మాలిటీస్ త్వరలో ముగుస్తాయని కేంద్ర హోం మంత్రి చెప్పారు.