2024 ఎన్నికల కోసం కొత్త కూటమిని ఏర్పరుస్తాం.. బీజేపీ చీఫ్‌ను తొలగించాలని కోరలేదు: ఏఐఏడీఎంకే సంచలనం
2024 లోక్ సభ ఎన్నికల కోసం కొత్త కూటమిని ఏర్పాటు చేస్తామని ఏఐఏడీఎంకే తెలిపింది. ఆ కూటమికి నాయకత్వం వహిస్తామని వివరించింది. బీజేపీతో తెగదెంపులు చేసుకున్న మూడు రోజులకు ఈ విషయాన్ని వెల్లడించింది. అలాగే.. తాము రాష్ట్ర బీజేపీ చీఫ్‌ను తొలగించాలని కోరలేదని స్పష్టం చేసింది. తాము అలాటి అనాగరిక నేతలం కాదని వివరించింది.
న్యూఢిల్లీ: వచ్చే పార్లమెంటు ఎన్నికల కోసం కొత్త కూటమిని ఏర్పాటు చేస్తామని ఏఐఏడీఎంకే వెల్లడించింది. తమిళనాడు సీఎం స్టాలిన్, ఆయన కొడుకు ఉదయనిధి స్టాలిన్ చెబుతున్నట్టు తాము బీజేపీతో తాము కూటమిలో లేమని స్పష్టం చేసింది. బీజేపీతో నాలుగేళ్ల బంధాన్ని తెంచుకున్నట్టు ప్రకటించిన మూడు రోజులకు తాజా వ్యాఖ్యలు చేసింది. 2024 లోక్ సభ ఎన్నికల కోసం కొత్త కూటమికి సారథ్యం వహిస్తామని చెప్పింది.
క్రిష్ణగిరిలో ఏఐఏడీఎంకే సీనియర్ లీడర్ కేపీ మునుసామి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే అన్నమళైని పదవి నుంచి తొలగించాలని కోరలేదని స్పష్టం చేశారు. ‘ఏఐఏడీఎంకే వంటి పెద్ద పార్టీ ఒక పార్టీని వారి రాష్ట్ర అధ్యక్షుడిని తొలగించాలని కోరుతుందని అనుకోవడం చిన్నపిల్లల మనస్తత్వం. మేం అలాంటి పొరపాటు ఎప్పుడూ చేయం’ అని స్పష్టం చేశారు. ‘వేరే పార్టీ ఎలా పని చేయాలో చెప్పే అనాగరిక నేతలం మేం కాము. ఏఐఏడీఎంకే అలాంటి పార్టీ కాదు’ అని వివరించారు.
ఇప్పుడు ఎన్డీఏ నుంచి వైదొలిగినా.. ఆ తర్వాత మళ్లీ కూటమిలో చేరుతారా? అని అడగ్గా.. ‘స్టాలిన్, ఉదయనిధి ఇదంతా డ్రామా అని మాట్లాడుతున్నారు. మేం బీజేపీతో పొత్తు తెంచుకుంటే ఎలా ఉంటుందో వారికి తెలుసు. అందుకే భయంతో వారు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. భవిష్యత్‌లో మళ్లీ ఎన్డీఏతో కలిసేది లేదు. మేం ఎడప్పాడి కే పళనిసామి సారథ్యంలో కొత్త కూటమిని సృష్టించి నాయకత్వం వహిస్తాం’ అని మునుసామి వివరించారు.
Also Read: చంద్రబాబుకు దోమలు కుడుతున్నాయ్.. రాజమండ్రి జైలు చుట్టూ ఫాగింగ్
చెన్నైలోని ఏఐఏడీఎంకే హెడ్ క్వార్టర్‌లో పార్టీ చీఫ్ పళనిసామి సారథ్యం లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో బీజేపీ నుంచి తెగదెంపులు చేసుకోవాలని, ఎన్డీఏ నుంచి వైదొలగాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై ద్రవిడియన్ పార్టీ కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.
ఈ నిర్ణయంపై తమ పార్టీ జాతీయ నాయకత్వం స్పందిస్తుందని తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షఉడు నారాయణ్ తిరుపతి తెలిపారు.