మూడు రోజుల్లో 44 మంది న్యాయమూర్తులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాం: సుప్రీంకోర్టులో కేంద్రం
సుప్రీంకోర్టులో ఈ రోజు న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియ పై వాడివేడిగా వాదనలు జరిగాయి. ఇక నుంచి న్యాయమూర్తుల ఎంపికకు కేంద్ర ప్రభుత్వం టైమ్‌లైన్ పాటిస్తుందని అటార్నీ జనరల్ వెంకటరమణి తెలిపారు. మూడు రోజుల్లో 44 మంది న్యాయమూర్తుల పేర్లను క్లియర్ చేస్తామని వివరించారు.

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం న్యాయమూర్తుల ఎంపికపై కీలక విషయం తెలిపింది. మూడు రోజుల్లో 44 మంది న్యాయమూర్తుల పేర్లను క్లియర్ చేస్తామని వివరించింది. న్యాయమూర్తుల ఎంపిక విషయంలో కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని అనుసరించాలని, నిబంధనలు పాటించాలని సుప్రీంకోర్టు సూటిగా తెలిపింది. న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియను మరింత జాప్యం చేయరాదని సూచించింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం పై హామీని ఇచ్చింది.
న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో జాప్యానికి సంబంధించిన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు విచారించింది. కోలీజియం సిఫార్సు చేసిన పేర్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే క్లియర్ చేయాలని, జాప్యం వహించవద్దని సూటిగా తెలిపింది. ఈ విచారణలో కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి వాదించారు.
న్యాయమూర్తుల ఎంపికలో కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా టైమ్‌లైన్ పాటిస్తుందని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి కోర్టుకు తెలిపారు. కొలీజియం సిఫార్సు చేసిన 104 మంది న్యాయమూర్తుల పేర్లు పెండింగ్‌లో ఉన్నాయని, అందులో 44 మంది న్యాయమూర్తుల పేర్లను ప్రాసెస్ చేసి ఈ వారం చివరిలోగా సుప్రీంకోర్టుకు పంపిస్తామని చెప్పారు.
అదే విధంగా కొలీజియం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించడానికి ఐదుగురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల పేర్లను రికమెండ్ చేశామని, దీనిపై భిన్నాభిప్రాయం ఉన్నదని టాప్ లీగల్ ఆఫీసర్ పేర్కొన్నారని ఈ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ ఏఎస్ ఓకాలు అటార్నీ జనరల్ వెంకటరమణిని అడిగారు. దీనికి సమాధానంగా ఈ విషయాన్ని కొంత వాయిదా వేయగలరని కోరారు. ఈ విషయంపై తనకు కొన్ని ఇన్‌పుట్లు ఉన్నాయని, కానీ, దానిపై తనకు కొంత వేరే అభిప్రాయం ఉన్నదని వివరించారు.
దీంతో సుప్రీంకోర్టు ఈ విచారణను వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేసింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సారథ్యంలోని కొలీజియం గత నెల ఐదుగురు న్యాయమూర్తులు పంకజ్ మిత్తల్, సంజయ్ కరోల్ సహా ఐదుగురు పేరర్లను టాప్ కోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించడానికి సిఫార్సులు చేసిన సంగతి తెలిసిందే.
గత కొంత కాలంగా న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియ పై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇటీవలే భిన్నాభిప్రాయాలతో వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే.