న్యూఢిల్లీ: భర్త రోహిత్ శేఖర్ తివారీ హత్య కేసులో అరెస్టయిన అతని భార్య అపూర్వ మానసిక స్థితి అర్థం కాకుండా ఉంది. భర్తను హత్య చేసి అరెస్టయినందుకు ఆమె కంటనీరు పెట్టిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. కానీ ఆమె అందుకు పశ్చాత్తాప పడుతోందా, నిశ్చింతగా ఉందా అనేది తెలియడం లేదని సంబంధిత అధికార వర్గాలంటున్నాయి. 

అపూర్వ ప్రవర్తన అయోమయంగా ఉందని అంటున్నారు. కొన్ని సార్లు పశ్చాత్తాపపడుతున్నట్లు కనిపిస్తోందని, మరికొన్ని సార్లు నిశ్చింతగా ఉన్నట్లు కనిపిస్తోందని ఆమెను విచారిస్తున్న అధికారులు అంటున్నారు. నాలుగు రోజుల విచారణలో ఆమె ఒక్కసారి కూడా ఏడవలేదని అంటున్నారు. అయితే, కొన్నిసార్లు మాత్రం పశ్చాత్తాపపడుతున్నట్లు కనిపించిందని చెబుతున్నారు. 

రోహిత్ శేఖర్ తల్లి ఉజ్వల తరుచుగా తమ మధ్య జోక్యం చేసుకునేదని, దానివల్ల తమ ఇద్దరి మధ్య గొడవలు జరిగాయని అపూర్వ చెప్పినట్లు సమాచారం. తాము నివాసం ఉంటున్న ఇళ్లు రోహిత్ శేఖర్ మరదలు ఇంటికి సమీపంలోనే ఉంటుంది. ఈ సామీప్యాన్నే కాకుండా రోహిత్ శేఖర్ ఆమెతో కలిసి మద్యం సేవించడాన్ని అపూర్వ ఇష్టపడలేదని అంటున్నారు. 

ఉత్తరాఖండ్ నుంచి వచ్చేటప్పుడు తామిద్దరం ఒకే గ్లాసులో మద్యం సేవించామని చెప్పి రోహిత్ శేఖర్ అపూర్వను కించపరిచాడని, ఆ గొడవనే హత్యకు దారి తీసిందని అంటున్నారు.