భారత్- చైనా సరిహద్దుల్లోని గాల్వాన్‌ లోయలో  చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. వీరిలో 16 బీహార్ రెజిమెంట్‌కు చెందిన నాయిబ్ సుబేదార్ నాదూరం సోరెన్ (43) కూడా ఉన్నారు.

దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ఆయన మరణవార్త ఇంత వరకు సోరెన్ భార్యాపిల్లలకు తెలియకపోవడం అత్యంత బాధాకరం. భార్య తట్టుకోలేదేమోనని కుటుంబసభ్యులు ఆ దుర్వార్తను ఆమెకు చెప్పలేక తీవ్ర మథనపడుతున్నారు.

నాదూరాం సోరెన్.... ఒడిశాలోని మయూర్ బంజ్ జిల్లా పరిధిలోని చంపావుదా గ్రామానికి చెందిన వారు. సంతాలి తెగకు చెందిన ఆయన 1997లో భారత సైన్యంలో చేరారు. నలుగురు అన్నదమ్ముల కుటుంబంలో ఆయనే పెద్దవారు. ఆ కుటుంబాన్ని పోషించేది... పెద్ద దిక్కు కూడా ఆయనే.

నాదూరాం భార్య వీరి గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే రాయ్‌రంగాపూర్‌లో ముగ్గురు పిల్లలతో ఉంటున్నారు. ఆమెకు ఇంతవరకూ ఆయన మరణవార్త తెలియదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. అన్న మరణాన్ని ఆమె తట్టుకుంటుందని మాకు అనిపించడం లేదు. ఆ వార్తను చెప్పడానికి మేం చాలా భయపడుతున్నామని దామన్ సోరెన్ ఉద్వేగానికి గురయ్యారు.

నాదూరాం మరణంపై ఆయన స్నేహితుడు మహంత మాట్లాడుతూ... మేమిద్దరం కలిసి ఒకే యూనిట్‌లో ఎనిమిదేళ్లు పనిచేశాం. రెండు నెలల క్రితం తనతో మాట్లాడాను.. కానీ ఇంతలో ఆయన ఆకస్మిక మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.