దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ అత్యాచార కేసు గురించి అందరికీ తెలిసిందే. కేసు తీవ్రత, ప్రజల నుంచి వస్తున్న నిరసనల నేపథ్యంలో యూపీ ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేసును దర్యాప్తు చేస్తోన్న సిట్‌ డీజీపీ భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రంలో కలకలం రేపింది.

డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ చంద్ర ప్రకాష్‌ సిట్‌ సభ్యుల్లో ఒకరు. ఆయన భార్య పుష్ప ప్రకాష్‌ (36) శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో లక్నోలోని వారి నివాసంలో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మరణించింది.

ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను లోహియా ఆస్పత్రికి తరలించారు. పుష్ప ప్రకాష్‌ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు.

సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం ఆమె మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.