వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించేందుకు సినిమా స్టైల్‌లో ప్లాన్ వేసింది. వివరాల్లోకి వెళితే.. గ్రేటర్ నోయిడాలో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ మేనేజర్‌గా పనిచేసే రాజీవ్ వర్మ భార్య శిఖా.. ఆమె నగరంలోని ఓ జిమ్‌లో ట్రైనర్‌గా పనిచేస్తోంది.

ఈ సమయంలో ఆమెతో పాటు పనిచేస్తున్న రోహిత్ కశ్యప్‌తో పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. దీంతో భర్త అడ్డు తొలగించేకుంటే ప్రియుడితో హాయిగా ఉండొచ్చని భావించింది.

ఇదే విషయాన్ని రోహిత్‌తో చెప్పింది. అతను కూడా అందుకు అంగీకరించి హత్య ప్రణాళికను పకడ్బందీగా అమలు చేసేందుకు రూ.1.2 లక్షలకు రోహన్ కుమార్ అనే కాంట్రాక్టర్ కిల్లర్‌తో ఒప్పందం చేసుకున్నాడు.

వీరు ముగ్గురు గతేడాది 23న వర్మను చంపే ఉద్దేశ్యంతో రాజీవ్ వర్మపై కాల్పులు జరిపారు. అయితే స్థానికులు ఆయనను ఆస్పత్రిలో చేర్చడంతో ప్రాణాపాయం తప్పింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తొలుత ఈ హత్యాయత్నం వ్యాపార లావాదేవీల కారణంగా జరిగివుండవచ్చని భావించారు.

అయితే దర్యాప్తులో భాగంగా ఇది వివాహేతర సంబంధం కారణంగా జరిగిన హత్యాయత్నంగా తేల్చారు. నిందితుల కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు గ్రేటర్ నోయిడాలోని సఖీపూర్ వద్ద ఆదివారం రోహిత్‌తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.