రెండో పెళ్లి చేసుకోవడానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన కేసులో... భార్య, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

న్యూఢిల్లీ : సెంట్రల్ ఢిల్లీలోని దర్యాగంజ్ ప్రాంతంలో భర్తను హత్య చేసిన కేసులో 40 ఏళ్ల మహిళను ఆమె ప్రేమికుడిని, మరొక వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితులను దర్యాగంజ్‌కు చెందిన జీబా ఖురేషీ, యూపీలోని మీరట్‌కు చెందిన షోయబ్ (29), యూపీలోని ఘజియాబాద్‌కు చెందిన వినిత్ గోస్వామి (29)గా గుర్తించినట్లు వారు తెలిపారు.

జీబా తన భర్త మొయినుద్దీన్ ఖురేషీని వదిలించుకోవాలని అనుకుని ఆ మేరకు హత్య చేసిందని పోలీసులు తెలిపారు. ఖురేషి, 47, మే 17 న దర్యాగంజ్‌లో రాత్రి 10 గంటల సమయంలో ఖల్సా స్కూల్ గేట్ నంబర్ 3 బయట మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు కాల్చి చంపేశారని పోలీసులు తెలిపారు.

విచారణలో, హత్యకు ఉపయోగించిన తెల్లటి మోటారు సైకిల్ ఆధారంగా కాల్పులు జరిపిన వ్యక్తులు యుపికి చెందినవారని పోలీసులు అంచనా వేశారు. మోటారు సైకిల్ దర్యాగంజ్‌లోని తారా హోటల్ సమీపంలో వదిలేసి వెళ్లారు. ఈ బండిని మీరట్ నుండి దొంగిలించారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఆ తరువాత దర్యాప్తులో మరిన్ని ఆధారాలతో, బాధితుడి భార్యతో సహా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్) శ్వేతా చౌహాన్ తెలిపారు.

జీబాకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆమె భర్త రియల్ ఎస్టేట్ వ్యాపారి. భర్తతో సంతోషంగా లేదని, అతడిని వదిలించుకుని వేరే పెళ్లి చేసుకోవాలని భావించిందని డీసీపీ తెలిపారు. ఆమెకు రెండేళ్ల క్రితం ఫేస్‌బుక్ ద్వారా షోయబ్‌తో పరిచయం ఏర్పడిందని, దీంతో అతడితో పరిచయం ప్రేమగా మారి ఇద్దరూ కలిసి ఉండాలని నిర్ణయంచుకున్నారు. 
ఈ నేపథ్యంలో భర్త అడ్డుగా ఉంటాడని భావించి జీబా తన భర్తను చంపి, తనను వివాహం చేసుకోవాలని షోయబ్‌ను ఒప్పించిందని చౌహాన్ చెప్పారు.

ఈ హత్యకోసం వారిద్దరూ ఐదు నెలల పాటు ప్లాన్ చేశారు. ఆ సమయంలో హత్యప్లాన్ లో షోయబ్ గోస్వామిని నియమించుకున్నారు. అతను మొయినుద్దీన్‌ను చంపడానికి రూ. 6 లక్షలు అడిగాడని పోలీసులు తెలిపారు.

గోస్వామీ, జీబీలు వాట్సాప్ 'అబౌట్ ఫీచర్'ని ఉపయోగించి ముఖ్యమైన సమాచారాన్ని సేకరించి, రెక్కీ నిర్వహించారని వారు చెప్పారు. జీబా ద్వారా షోయబ్ తనతో పంచుకున్న సమాచారంతోగోస్వామి చాలాసార్లు మొయినుద్దీన్‌ను చంపడానికి ప్రయత్నించాడు, కానీ విజయం సాధించలేదు.

జీబా తన భర్తను చంపి త్వరగా పెళ్లి చేసుకోవాలని షోయబ్‌పై గట్టిగా ఒత్తిడి చేయడంతో, షోయబ్, గోస్వామి మీరట్‌కు వెళ్లి దొంగిలించిన బైక్ ను తమ ప్లాన్ కోసం ఏర్పాటు చేసుకున్నారని పోలీసులు తెలిపారు. దీనికోసం మే 17న తుపాకీతో రావాలని గోస్వామిని కోరినట్లు పోలీసులు తెలిపారు.

గోస్వామి మే 17న తిరిగి వచ్చి మొయినుద్దీన్‌ను బాగా దగ్గరి నుంచి కాల్చిచంపాడు. షోయబ్, గోస్వామి ఇద్దరూ దొంగిలించిన బైక్‌పై దాడి చేసి పారిపోయారని డీసీపీ తెలిపారు. హెల్త్ సప్లిమెంట్ వ్యాపారి అయిన షోయబ్ నాలుగు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. అతడికి మూడు క్రిమినల్ కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి దొంగిలించబడిన మోటార్‌సైకిల్, కంట్రీ మేడ్ పిస్టల్, రూ. 3 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.