దర్యాప్తును ముమ్మరం చేసేందుకు ఏసీపీ బ్రహ్మజీత్ సింగ్ ఆధ్వర్యంలో బేగంపూర్ నుంచి ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు.
ఓ పాల వ్యాపారిని కట్టుకున్న భార్య అతి కిరాతకంగా హత్య చేయించింది. తన ప్రియుడితో కలిసి జీవించాలని.. అందుకు భర్త అడ్డుగా ఉన్నాడని సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించింది. కాగా.. ఈ కేసును పోలీసులు చేధించారు. సదరు మహిళ, ఆమె ప్రియుడు సహా మొత్తం ఏడుగురిని అరెస్టు చేశారు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సోమవారం ఉదయం రోహిణి ప్రాంతంలోని హెలిపోర్ట్ రోడ్డులో 35 ఏళ్ల పాల వ్యాపారి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడు రోహిణిలోని రితాలా నివాసి ప్రదీప్‌గా గుర్తించారు.
బేగంపూర్ పోలీసులకు ఉదయం 5.53 గంటలకు ట్రాఫిక్ సిగ్నల్ తర్వాత హెలిపోర్ట్ రోడ్డుపై మృతదేహం పడి ఉందని పిసిఆర్ కాల్ వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందం.. పాల వ్యాపారిగా పనిచేస్తున్న ప్రదీప్ తన మోటార్‌సైకిల్‌తో పాటు రోడ్డుపై పడి ఉండడం గమనించారు. ప్రాథమిక విచారణలో బాధితుడి కీలక భాగాలపై తుపాకీ గాయాలు ఉన్నాయని తేలింది.
దర్యాప్తును ముమ్మరం చేసేందుకు ఏసీపీ బ్రహ్మజీత్ సింగ్ ఆధ్వర్యంలో బేగంపూర్ నుంచి ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు.
కాగా.. మృతుడి భార్య సీమ తమ ఇంట్లో అద్దెకు ఉంటున్న గౌరవ్ తియోటియాతో అక్రమ సంబంధం పెట్టుకుందని విచారణలో తేలింది. పోలీసులు కాల్ రికార్డ్ వివరాలను సేకరించారు. కేసు విచారణలో భాగంగా గౌరవ్ , సీమా స్నేహితులు , బంధువులను కూడా విచారించారు.
వారిని విచారించిన తర్వాత వీరిద్దరే హత్య చేసినట్లు అనుమానం కలిగింది. దీంతో... వారిద్దరినీ అదుపులోకి తీసుకొని.. తమదైన శైలిలో పోలీసులు ప్రశ్నించారు. దీంతో నిందితులు నేరం అంగీకరించారు. రూ.4లక్షల సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించినట్లు తెలిపారు.
ఈ కేసు గురించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌరవ్, సీమకు గత ఎనిమిదేళ్లుగా అక్రమ సంబంధం ఉందని, వీరిద్దరూ భర్తను హత్య చేసేందుకు కుట్ర పన్నారని తెలిపారు. వీరి అక్రమ సంబంధాన్ని ప్రదీప్ వ్యతిరేకించాడు. అందుకే అతని అడ్డు తొలగించేందుకు ఇలా పథకం వేశారు.
గౌరవ్, అతని స్నేహితులు , సీమ... ప్రదీప్ హత్యకు ప్లాన్ చేశారు. హత్యను అమలు చేయడానికి సహచరులకు రూ.4 లక్షలు ఇచ్చారు. మిగతా నిందితులను షూటర్, రింకూ, గౌరవ్, ప్రశాంత్, ప్రవీందర్, వినేష్‌లుగా గుర్తించారు. బాధితుడు తన మోటార్‌సైకిల్‌పై వెళుతున్నప్పుడు తుపాకీతో కాల్చేశాడు. తీవ్రగాయాలతో.. ప్రదీప్ చనిపోయాడు.
నిందితుల నుంచి రెండు స్ప్లెండర్ బైక్‌లు, రెండు కంట్రీ మేడ్ పిస్టల్స్, ఒక ఆటోమేటెడ్ పిస్టల్, పది లైవ్ కాట్రిడ్జ్‌లు, ఆరు మొబైల్ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
