చెన్నై: ప్రియుడి మోజులో ఓ వివాహిత భర్తను హత్య చేసింది. ఇంట్లోనే  భర్త మృతదేహాన్ని పాతిపెట్టింది. చివరకు ఈ విషయం వెలుగుచూడడంతో పోలీసులు మృతదేహాన్ని పెరట్లో నుండి వెలికితీశారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

తమిళనాడు రాష్ట్రంలోని విల్లుపురం జిల్లా పూవరసం కుప్పంలో వివాహిత భర్తను హత్య చేసింది. విక్రవాండి సమీపంలోని పనయకపురానికి చెందిన లియోబాల్ కు సుజిత మేరికి 2013లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. భార్యతో కలిసి లియోబాల్ పూవరసం కుప్పంలో నివసిస్తున్నాడు. 

రాధాకృష్ణన్ అనే యువకుడితో లియోబాల్ కు పరిచయమైంది. వీరిద్దరూ స్నేహితులయ్యారు. ఫిబ్రవరి 4వ తేదీన బంధువుల పెళ్లికి వెళ్లిన లియోబాల్ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తండ్రి సహాయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో లియోబాల్ భార్య సుజిత మేరి, రాధాకృష్ణన్ కూడ అదృశ్యమయ్యారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు విచారణ చేస్తే సుజిత మేరీ, రాధాకృష్ణన్ మధ్య వివాహేతర సంబంధం ఉన్న విషయం వెలుగు చూసింది.

రాధాకృష్ణన్ తో తన భార్య వివాహేతర సంబంధం కలిగి ఉన్న విషయాన్ని గుర్తించిన లియోబాల్ భార్యను మందలించాడు. దీంతో ప్రియుడితో కలిసి భర్త లియోబాల్ ను సుజిత మేరి హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇంటి పెరట్లో  లియోబాల్ మృతదేహాన్ని పూడ్చిపెట్టారు.మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం తరలించారు.

నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.