ఢిల్లీలో దారుణం జరిగింది. భర్తను ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేయించింది. వివరాల్లోకి వెళితే..  ఆగ్రాకు సమీపంలోని భాహ్ గ్రామానికి చెందిన సత్యపాల్, సర్వేశ్‌లకు సుమారు 9 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం.

అయితే సత్యపాల్‌కు మద్యంతో పాటు కొన్ని దురలవాట్లు ఉండటంతో ఇంట్లో భార్యను పట్టించుకునేవాడు కాదు. దీంతో ఆమె తన భర్త పట్ల విరక్తి చెందింది. ఈ క్రమంలో సర్వేష్‌కు ఇంటి పక్కనే నివసించే విజయ్ అనే 22 ఏళ్ల విజయ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారి తీసింది.

సత్యపాల్ ఇంట్లో లేని సమయంలో ఆమె విజయ్‌తో ఏకాంతంగా గడిపేది. అతనికి పూర్తిగా అలవాటు పడిన సర్వేశ్.. విజయ్‌ని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని భావించి.. భర్త అడ్డును తొలగించుకోవాలని భావించింది.

తన ఒంటిపై వున్న ఆభరణాలతో పాటు రూ.10 వేల నగదును విజయ్‌కి ఇచ్చి కిరాయి హంతకులతో భర్తను చంపించాల్సిందిగా కోరింది. దీంతో విజయ్ తనకు తెలిసిన కిరాయి హంతకులు శివ్రత్, విపిన్, ఛత్రపాల్‌తో ఒప్పందం కుదుర్చుకుని సత్యపాల్ హత్యకు పథకం పన్నాడు.

వీరు నలుగురు కలిసి సత్యపాల్‌ మెడను దారంతో బిగించి హత్య చేశారు. అనంతరం అతని మృతదేహాన్ని సమీపంలోని అటవీ ప్రాంతంలో పడేశారు. మూడు రోజులు గడుస్తున్నా సత్యపాల్ ఆచూకీ తెలియకపోవడంతో అతని సోదరుడు సిద్ధార్‌నాధ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రంగంలోకి దిగిన పోలీసులు దాదాపు మూడు నెలల నుంచి సత్యపాల్ ఆచూకీ కోసం తీవ్రంగా గాలించారు. ఈ క్రమంలో సోమవారం సన్సార్ గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

దర్యాప్తులో భాగంగా సత్యపాల్‌ను అతని భార్య సర్వేశే హత్య చేయించిందని భావించిన పోలీసులు ఆమెతో పాటు ప్రియుడు విజయ్‌ అతనికి సహకరించిన కిరాయి హంతకులను అదుపులోకి తీసుకున్నారు.