తమ వివాహేతర సంబంధానికి అడ్డు పడుతున్నారని భర్తకు ప్రేమగా బిర్యానీ వండి అందులో విషం కలిపి చంపేందుకు ప్రయత్నించిందో భార్య. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా జోలార్‌పేట, ఏలగిరి కొండ అత్తనావూరుకు ప్రాంతానికి  చెందిన సెల్వం హూసూరులో ఉద్యోగం చేస్తున్నాడు.

ఇతనికి భార్య జయమతి, కుమార్తె ఉంది. అయితే జయమతికి జోలార్‌పేటలో చదువుకుంటున్న సమయంలో ఓ అధ్యాపకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం సెల్వానికి తెలియడంతో దంపతుల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి.

ఈ క్రమంలో జూన్ 17వ తేదీన కుమార్తె పుట్టినరోజు కావడంతో సెల్వం హూసూరు నుంచి ఇంటికి వచ్చాడు. ఆ రోజున మరోసారి వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ప్రియుడితో తన బంధానికి అడ్డుగా ఉన్నాడని నిర్ణయించుకున్న జయమతి.. బిర్యానీ వండి అందులో విషం కలిపి భర్తకు పెట్టింది.

దానిని తిన్న సెల్వం వాంతులు చేసుకుంటూ స్పృహ తప్పిపడిపోయాడు. ఆ సమయానికి అక్కడికి వచ్చిన సెల్వం కుటుంబసభ్యులు సెల్వాన్ని హుటాహుటిన కృష్ణగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు పరారీలో ఉన్న జయమతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.