Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్.. ఆర్టీఐ దాఖలు చేసి భర్త ఆదాయ వివరాలు పొందిన భార్య

ఓ మహిళ తన భర్త వివరాలు తెలుసుకోవడానికి ఆర్టీఐని ఆశ్రయించింది. తొలుత ఆమెకు సమాచారం దక్కకున్నా.. పలు ప్రయత్నాలు చేసి ఎలాగోలా భర్త వివరాలు పొందడానికి ఆదేశాలు సంపాదించుకుంది. సదరు మహిళకు ఆమె భర్త ఆదాయ వివరాలు 15 రోజుల్లో అందించాలని సీపీఐవోను సీఐసీ ఆదేశించింది.

wife gets husbands income details through filing RTI
Author
First Published Oct 3, 2022, 3:19 PM IST

న్యూఢిల్లీ: ఎవరైనా సరే.. సంపాదన వివరాలను బయట పెట్టడానికి ఇష్టపడరు. చాలా వరకు ఆదాయ వివరాలను గోప్యంగానే ఉంచుతారు. ఈ వివరాలు కేవలం కుటుంబ సభ్యులు, సమీప బంధువులకు మాత్రమే చెప్పుకుంటూ ఉంటారు. కానీ, ఈ వివరాలు కొన్ని అసాధారణ పరిస్థితుల్లో బహిరంగంగా చర్చకు వస్తుంటాయి. అందులో వివాహ సంబంధ వివాదాలు వచ్చినప్పుడు భర్త ఆదాయ వివరాలు చర్చకు వస్తాయి.

ఒక వేళ ఈ వివాదాలు విడాకుల వరకు వెళ్లితే.. అది ఇద్దరికీ ఇష్టపూర్వకంగా లేని విడాకులైతే.. భర్త ఆదాయ వివరాలు మరింత ఎక్కువగా చర్చిస్తారు. ఆస్తులను వారిద్దరి మధ్య విభజిస్తారు. భార్యకు విడాకులు ఇష్టం లేకుంటే.. భర్త నుంచి భరణం డిమాండ్ చేస్తుంది. మెయింటెనెన్స్ కావాలని కోర్టులో డిమాండ్ చేస్తూ ఉంటారు.

అయితే, భర్త తన భార్యకు ఆదాయ వివరాలు చెప్పడంలో విముఖత వ్యక్తం చేస్తే.. భార్య ఇతర మార్గాల్లోనూ ఆ వివరాలు తెలుసుకోవచ్చు. ఇలాంటి ఓ ఘటన ఇటీవలే చోటుచేసుకుంది. ఓ మహిళ.. తన భర్త ఆదాయ వివరాలను ఆర్టీఐ (రైట్ టు ఇన్ఫర్మేషన్) దాఖలు చేసి సంపాదించుకుంది.

ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం, మహిళ దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తును సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సీఐసీ) పరిశీలించింది. ఆ మహిళకు గ్రాస్ ఇన్‌కమ్ లేదా ట్యాక్స్ పడుతున్న ఇన్‌కమ్ వివరాలు చూచాయగా అందించాలని ఐటీ శాఖను సీఐసీ ఆదేశించింది.

సంజు గుప్తా అనే మహిళ తన భర్త ఆదాయ వివరాలు కావాలని ఆర్టీఐ దరఖాస్తు చేసింది. కానీ, తొలుత ఈ ఆర్టీఐ దరఖాస్తును సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఐటీ శాఖ అధికారి తిరస్కరించారు. భర్త అనుమతి లేని కారణంగా ఈ వివరాలు అందించలేమని పేర్కొన్నారు. 

దీంతో ఆ మహిళ ఫస్ట్ అప్పెల్లేట్ అథారిటీలో అప్పీల్ చేసి సహాయం అర్థించింది. సీపీఐవో ఆదేశాలను ఎఫ్ఏఏ కూడా సమర్థించింది. దీంతో సంజు గుప్తా మరోసారి సీఐసీలో అప్పీల్ చేయాల్సి వచ్చింది.

సీఐసీ తన గత ఆదేశాలు, సుప్రీంకోర్టు తీర్పులను కొన్నింటిని తిరగేసింది. ఆ తర్వాత 2022 సెప్టెంబర్ 19న తాజా ఆదేశాలు వెలువరించింది. భర్త పన్ను పడుతున్న ఆదాయ వివరాలు లేదా స్థూల ఆదాయ వివరాలు (ప్రభుత్వం దగ్గర ఉన్న) 15 రోజుల్లోగా ఆ మహిళకు అందించాలని సీపీఐవోను సీఐసీ ఆదేశించింది.

Follow Us:
Download App:
  • android
  • ios