ముంబై: భర్తకు బట్టతల వుందని ఓ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పెళ్ళిచూపుల సమయంలో ఈ విషయాన్ని తనకు తెలియజేయలేదని... ఇలా మోసం చేసి పెళ్లిచేశారంటూ భర్తతో పాటు అత్తమామలపై కూడా చీటింగ్ కేసు పెట్టింది నవవధువు. 

వివరాల్లోకి వెళితే... మహారాష్ట్ర రాజధాని ముంబై మీరా రోడ్డుకు చెందిన ఓ చార్టెడ్ అకౌంటెంట్ వివాహం ఇటీవలే జరిగింది. అయితే అతడికి బట్టతల వుండటంతో పెళ్లిచూపులు, పెళ్లి సమయంలోనూ విగ్ తో కవర్ చేశారు. ఈ విషయాన్ని యువతి కుటుంబసభ్యులకు కానీ, యువతికి కానీ చెప్పలేదు. ఇదే ఇప్పుడు భర్తపై భార్య పోలీస్ కేసు పెట్టి తెగతెంపులు చేసుకునే దాకా వెళ్లింది. 

అత్తింటికి వెళ్లిన తర్వాత వధువు భర్త యొక్క బట్టతలను చూసి ఆశ్చర్యపోయింది. ఈ విషయాన్ని ఎందుకు దాచారంటూ భర్త, అత్తమామలతో గొడవకు దిగి నేరుగా నయానగర్ పోలీస్ స్టేషన్‌ కు వెళ్లింది. తనను అత్తింటివారు మోసం చేశారంటూ ఫిర్యాదు చేసింది. 

ఆమె ఫిర్యాదును స్వీకరించి భర్తతో పాటు కుటుంబసభ్యులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇతరనిందితులకు ముందస్తు బెయిలు రాగా భర్తకు మాత్రం కోర్టు బెయిల్ నిరాకరించిందని... పోలీసుల ఎదుట లొంగిపోవాల్సిందిగా కోర్టు ఆదేశించినట్టు పోలీసులు తెలిపారు. అతన్ని అతి త్వరలో అరెస్ట్ చేస్తామని ముంబై పోలీసులు తెలిపారు.