Asianet News TeluguAsianet News Telugu

భర్త పర్మిషన్ లేకున్నా భార్య అబార్షన్ చేసుకోవచ్చు: కేరళ హైకోర్టు సంచలన తీర్పు

అబార్షన్ చేయించుకోవడానికి భర్త అనుమతి పొందాల్సిన అవసరం గర్భిణికి లేదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. చట్టంలో భర్త అనుమతి తీసుకోవాలనేమీ లేదు అని పేర్కొంది. గర్భం దాల్చినప్పటి నుంచి ఒత్తిడి, భారంతోపాటు డెలివరీ కష్టాలనూ మహిళనే భరిస్తుందని ఈ సందర్భంగా కోర్టు ప్రస్తావించింది.

wife can terminate pregnancy irrespective of husbands nod
Author
First Published Sep 27, 2022, 6:24 PM IST

తిరువనంతపురం: ఒక వివాహిత తన గర్భాన్ని విచ్ఛేదనం చేసుకోవడానికి భర్త అనుమతి లేదా ఆమోదం పొందాల్సిన అవసరం లేదని కేరళ హైకోర్టు సోమవారం స్పష్టం చేసింది. 21 ఏళ్ల ఓ వివాహిత దాఖలు చేసిన పిటిషన్ విచారిస్తూ ఈ నెల 26వ తేదీన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్‌లో గర్భస్రావం కోసం భర్త అనుమతి తీసుకోవాలనే నిబంధన ఏమీ లేదని పేర్కొంది. గర్భం దాల్చినప్పటి నుంచి ఒత్తిడి, భారంతోపాటు డెలివరీ కష్టాలనూ మహిళనే భరిస్తుందని ఈ సందర్భంగా కోర్టు ప్రస్తావించింది. ఈ కేసులో సదరు గర్భిణి తన భర్త నుంచి చట్టబద్ధంగా విడిపోలేదు. 

కేరళలోని కొట్టాయంకు చెందిన 21 ఏళ్ల మహిళ ఇష్టపడ్డ వ్యక్తితో పారిపోయింది. కొన్ని నెలల తర్వాత ఆయనను పెళ్లి చేసుకుంది. కానీ, పెళ్లి చేసుకున్న తర్వాత భర్త, అత్త ఆ మహిళను వేధించడం మొదలుపెట్టారు. కొన్నాళ్లకు ఆమె గర్భం దాల్చింది. కానీ, భార్యపై భర్తకు అనుమానాలు నెలకొన్నాయి. ఆమె పాతివ్రత్యం పై అపనమ్మకాలు వచ్చాయి. ఈ కారణంగా గర్భవతి అయినా తన భార్యకు ఆర్థికంగా, భావోద్వేగంగా ఎలాంటి సహాయం ఇవ్వడానికైనా నిరాకరించాడు.

తన భర్త, అత్తలు దుర్మార్గపు వ్యవహారం రోజు రోజుకు పెరిగింది. ఆ గర్భిణి తన తల్లి వద్దకే వెళ్లిపోయింది.ఆ తర్వాత తన గర్భాన్ని తొలగించుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఆమె ఓ క్లినిక్ వద్దకు వెల్లింది. కానీ, ఆమె తన భర్త నుంచి వేరుపడ్డట్టు ఎలాంటి చట్టబద్ధ డాక్యుమెంట్లు లేని కారణంగా అబార్షన్ చేయడానికి డాక్టర్ నిరాకరించారు.

ఈ తరుణంలోనే సదరు గర్భిణి హైకోర్టును ఆశ్రయించారు. తన భర్తతో మహిళకు ఉన్న సంబంధాలు మారిపోయాయని ఆమె తన భర్తపై ఇచ్చిన క్రిమినల్ కంప్లైంట్ వెల్లడిస్తున్నదని, అలాగే, తన భార్య గర్భాన్ని కొనసాగించాలనే అభిప్రాయాలు భర్త నుంచి రాలేదని హైకోర్టు పేర్కొంది. ఈ కారణాలను పేర్కొంటూ తీర్పు వెలువరించింది.

ఆ మహిళ దాంపత్య జీవితంలో పెనుమార్పులు వచ్చాయని, అందుకే సదరు గర్భిణీకి గర్భవిచ్ఛేదం  చేసుకోవడాికి అనుమతి ఇస్తున్నట్టు వివరించింది. కాబట్టి, కొట్టాయం మెడికల్ కాలేజీ లేదా ఇతర ప్రభుత్వ ఆస్పత్రులు ఆమె ప్రెగ్నెన్సీని టర్మినేట్ చేయాలని తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios