తాను ఇంటికి వచ్చినా పట్టించుకోకుండా ఫోన్ మాట్లాడుతున్న భార్యను ఓ భర్త నిందించాడు. అంతే... తననే నిందించాడనే కోపంతో.. భర్తకు వాటర్ హీటర్ తో వాతలు పెట్టింది. ఈ దారుణ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కర్ణాటక రాష్ట్రం హోసూరుకి సమీపంలోని పంజల్ తురై గ్రామానికి చెందిన చిన్నరాజ్(37) అనే వ్యక్తి కి ఏడేళ్ల క్రితం జ్యోతి అనే యువతితో వివాహమైంది. కాగా... వీరికి ఆరేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. చిన్నరాజ్ జేసీబీ డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం పని ముగించుకొని ఇంటికి వచ్చిన చిన్నరాజ్ కి భార్య ఫోన్  మాట్లాడుతూ కనిపించింది.

తాను వచ్చిన విషయం కనీసం పట్టించుకోకూడండా ఫోన్ మాట్లాడుతుండటంతో చిర్రెత్తిపోయింది. వెంటనే ఈ విషయంపై భార్య ను నిలదీశాడు. తనను భర్త నిలదీయడంతో తట్టుకోలేకపోయిన జ్యోతి ఓ పథకం వేసింది. తన స్నేహితులను ముగ్గురిని ఇంటికి పిలిచి .. నిద్రపోతున్న తన భర్తను కదలకుండా పట్టుకోమని స్నేహితులకు పురమాయింది. వాళ్లు అలా పట్టుకోగానే... వాటర్ హీటర్ తో భర్తకు వాతలు పెట్టింది. 

తీవ్రగాయాలపాలైన చిన్నరాజ్ ని స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న జ్యోతి కోసం గాలిస్తున్నారు.