ఎంతో అన్యోన్యంగా, ప్రేమగా కాపురం చేస్తున్న భార్య తన భర్తను అతి కిరాతకంగా హతమార్చింది. పెళ్లైన 8నెలలకే భర్తను ప్రేమికుడితో కలిసి చంపించింది.
మధ్యప్రదేశ్ : పెళ్లైన ఎనిమిది నెలలకే ఓ వ్యక్తి కనిపించకుండా పోయాడు. అతని గురించి ఆరా తీయగా వెలుగులోకి వచ్చిన విషయాలు తెలిసి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. బంధుమిత్రుల సమక్షంలో సంతోషంగా పెళ్లి చేసుకున్న ఆ జంట.. ఎంతో ప్రేమగా ఉండేది. భార్య చూపించే ప్రేమకు భర్త ఎంతో మురిసిపోయి ఈ ప్రేమికుల రోజును ఘనంగా జరుపుకోవాలని నిశ్చయించుకున్నారు. అంతలోనే ఈనెల తొమ్మిదవ తేదీన ఆ భర్త కనిపించకుండా పోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు అంతా వెతికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈ కేసులో పదిరోజుల తర్వాత షాకింగ్ ట్విస్టు వెలుగు చూసింది. అదృశ్యమైన వ్యక్తి భార్యను అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భింద్ లో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. భింద్ ప్రాంతానికి చెందిన మోనూ చౌదరికి నిరుడు మే నెలలో రాధ అనే యువతితో పెద్దలు వివాహం జరిపించారు. అప్పటినుంచి వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు.
కాగా ఈనెల తొమ్మిదవ తేదీన మోనూ చౌదరి కనిపించకుండా పోయాడు. దీంతో భర్త కనిపించడం లేదంటూ రాధ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా వారింటి దగ్గరలోని సీసీటీవీ ఫుటేజీని చెక్ చేశారు. ఈ క్రమంలోనే మోనూ చౌదరి అదృశ్యమైన రోజు రైల్వే స్టేషన్ కు వెళ్లినట్టుగా తెలిసింది, దీంతో రైల్వే స్టేషన్ లోని సీసీటీవీ ఫుటేజీని కూడా పోలీసులు పరిశీలించారు.
ఘటన జరిగిన రోజు మోను రైల్వే స్టేషన్ లో నుంచి బయటికి వస్తుండగా ఓ వ్యక్తి అతడిని వెంబడించినట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో అనుమానంతో ఆ ఫుటేజీని కుటుంబ సభ్యులకు చూపించారు. మోనూను వెంబడించిన ఆ వ్యక్తిని రాధ తండ్రి గుర్తుపట్టాడు. మోనూను వెంబడించిన ఆ వ్యక్తి పేరు అనురాగ్ అని చెప్పాడు. అంతేకాదు అతడు రాధకు పెళ్లికాకముందు ఆమెను వేధించేవాడని, తాము చాలాసార్లు హెచ్చరించామని చెప్పారు.
దీంతో, అనుమానితుడిగా భావించి పోలీసులు అనురాగ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత పోలీస్ స్టైల్ లో విచారించారు. ఈ క్రమంలోనే రాధా, అనురాగ్ ప్రేమికులన్న విషయం వెలుగు చూసింది. మోనూను పెళ్లి చేసుకోవడం రాధకు ఇష్టం లేదని.. తల్లిదండ్రుల బలవంతంతో అయిష్టంగా పెళ్లికి ఒప్పుకుందని తేలింది. ఈ క్రమంలోనే పెళ్లి తర్వాత కూడా రాధ.. అనురాగ్ ను తరచూ కలుసుకునేదని.. తమకు అడ్డుగా ఉన్న భర్తను హత్య చేయాలని ప్రియుడితో కలిసి పథకం వేసిందని బయటపడింది.
వీరి పథకం ప్రకారమే ఫిబ్రవరి 9వ తేదీన మోనూను వెంబడించిన అనురాగ్ అతడికి తన బైక్ మీద లిఫ్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత మార్గమధ్యంలో ఓ నిర్జన ప్రదేశంలో మోనూను హత్య చేసి.. శవాన్ని ఆధారాలు దొరకకుండా కాల్చేసినట్లుగా తేలింది. అనురాగ్ చెప్పిన వివరాల మీదకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ పథకంలో భాగస్వామి అయిన మోనూ భార్య రాధను కూడా అరెస్టు చేశారు.
