భారత వ్యతిరేకి బ్రిటీష్ ఎంపీ తన్‌మన్‌జిత్ సింగ్ ధేసీని, ఆమ్ ఆద్మీ పార్టీ నేత, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఎందుకు కలిశారో చెప్పాలని మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ జేజే సింగ్ ప్రశ్నించారు. వారి సమావేశంలో ఏ విషయంపై చర్చించారో బహిర్గతపర్చాలని తెలిపారు.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, బ్రిటీష్ లేబర్ పార్టీ నేత, ఎంపీ తన్‌మన్‌జిత్ సింగ్ ధేసీని కలిశారని, దీనికి కారణం ఏంటో చెప్పాలని మాజీ ఆర్మీ చీఫ్ జేజే సింగ్ డిమాండ్ చేశారు. కాశ్మీర్ విషయంలో తన్‌మన్‌జిత్ సింగ్ ధేసీ భారత వ్యతిరేక వైఖరిని అవలంబించారని గుర్తు చేశారు. అలాంటి నాయకుడిని కలిసే అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.
భారతదేశానికి వ్యతిరేకంగా అభిప్రాయాలు కలిగి ఉన్న వివాదాస్పద ఎంపీని పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఎంపీ రాఘవ్ చద్దా ఘనంగా స్వాగతించారని జేజే సింగ్ అన్నారు. తమ సమావేశంలో ఏం జరిగిందో ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పాలని కోరారు. ఈ సమావేశం ఎన్నారైల సంక్షేమం గురించేనా, లేక కొంతమంది అనుమానాస్పద వ్యక్తులను బ్లాక్ లిస్టు నుంచి బయటకు తీసుకురావడానికా ? అని ప్రశ్నించారు. లేకపోతే కాశ్మీర్‌కు సంబంధించినదా అని అడిగారు. భారత్‌కు వ్యతిరేకంగా ఉన్న సమస్యలపై ధేసీ అహేతుకమైన, అసంబద్ధమైన వైఖరిని తీసుకున్నారని ఆయన అన్నారు.
కశ్మీర్ అంశంపై భారత్‌ను ధేసీ బాహాటంగానే ప్రశ్నించారని జేజే సింగ్ అన్నారు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, బ్రిటన్ ఈ విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోకూడదని చెప్పారు. పాకిస్థాన్ లేదా మరే ఇతర దేశంతో ద్వైపాక్షిక సమస్యల్లో భారత్‌కు మూడో పక్షం జోక్యం అవసరం లేదని ధేసీ లాంటి వ్యక్తులు తెలుసుకోవాలని సింగ్ అన్నారు.
2019 సంవత్సరంలో తన్‌మన్‌జిత్ సింగ్ ధేసీ కాశ్మీర్ అంశంపై భారత్ తీసుకున్న చర్యలను ఆయన విమర్శించారు. ‘‘ ఆర్టికల్ 370ని రద్దు చేయడం, కశ్మీరీల నుండి రాష్ట్ర హోదాను తొలగించడం వంటి భారత ప్రభుత్వ నిర్ణయానికి నేను మద్దతు ఇవ్వను. ’’ అని అన్నారు. అదే ఏడాది ఆగస్గులో ఆయన భారత్ కు వచ్చినప్పుడు తన వైఖరిని పునరుద్ఘాటించారు. ఆర్టికల్ 370ని రద్దు చేసి, జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించినందుకు భారత ప్రభుత్వాన్ని విమర్శించారు. రైతుల ఉద్యమ సమయంలో తమన్‌జిత్ సింగ్ ధేసి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు.
అయితే ఈ పరిణామంపై ఆమ్ ఆద్మీ పార్టీ స్పందించింది. ధేసీ.. మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, కేంద్ర మంత్రులతో కలిసి ఉన్నప్పుడు తీసిన చిత్రాలను ఆ పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన్‌మన్‌జిత్‌సింగ్ ధేసీ భారత వ్యతిరేకి అయితే కేంద్రంలోని మోదీ ప్రభుత్వ హయాంలో దేశానికి రావడానికి ఎందుకు అనుమతించారని ఆమ్ ఆద్మీ పార్టీ నేత నీల్ గార్గ్ ప్రశ్నించారు. పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు బీజేపీ అనవసరంగా ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
