Punjab Election 2022: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు వేర్పాటువాద ఆకాంక్ష ఉంద‌ని మాజీ పార్టీ నాయకుడు కుమార్ విశ్వాస్ చేసిన వ్యాఖ్యలకు ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ విష‌యం ముందే తెలిస్తే.. 2017 ఎన్నిక‌ల్లో ఎందుకు బ‌య‌ట‌పెట్ట‌లేద‌ని కుమార్ విశ్వాస్ ను  ఆప్ నేత రాఘవ్ చద్దా సూటిగా ప్ర‌శ్నించారు. కేజ్రీవాల్‌పై దుష్ప్ర‌చారం చేయ‌డానికి, ఓ ప‌ద్ధ‌తి ప్ర‌కారం ఇలా ప్ర‌చారాలు చేస్తున్నార‌ని ఆయ‌న తీవ్రంగా మండిప‌డ్డారు.  

Punjab Election 2022: ఎన్నికల ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలు 'తప్పుడు ప్రచారం' చేస్తున్నాయని ఆరోపిస్తూ అరవింద్ కేజ్రీవాల్‌పై కుమార్ విశ్వాస్ చేసిన త‌ప్పుడు ప్ర‌చారాల‌కు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గురువారం కౌంటర్ ఇచ్చింది. మొహాలీలో విలేకరుల సమావేశంలో ఆప్‌కి చెందిన రాఘవ్ చద్దా ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంక గాంధీలపై విరుచుకుపడ్డారు. విశ్వాస్ ప్రకటనను అడ్డం పెట్టుకుని ప్ర‌తిప‌క్షాలు ల‌బ్ది పొందాల‌ని ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు వేర్పాటువాద ఆకాంక్ష ఉంద‌ని మాజీ పార్టీ నాయకుడు కుమార్ విశ్వాస్ చేసిన వ్యాఖ్యలకు ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ వ్యాఖ్య‌ల‌పై ఆప్ నేత రాఘవ్ చ‌ద్దా మాట్లాడుతూ.. ఈ విష‌యం ముందే తెలిస్తే.. 2017 ఎన్నిక‌ల్లో ఎందుకు బ‌య‌ట‌పెట్ట‌లేద‌ని, ఇంత కాలం ఎందుకు మౌనంగా ఉన్నావ‌ని ఆప్ నాయకుడు రాఘవ్ చద్దా సూటిగా ప్ర‌శ్నించారు. ఇన్నాళ్లుగా అరవింద్ కేజ్రీవాల్ యొక్క దురుద్దేశాలను భద్రతా ఏజెన్సీలకు ఎందుకు తెలియజేయలేదని నిల‌దీశారు. 

పంజాబ్ ఎన్నికలకు 1-2 రోజుల ముందు ఎందుకు బయటకు పెట్టారు ? మీరు 2018 వరకు పార్టీలో ఉన్నారు. మీరు కోరుకున్న రాజ్యసభ సీటు రాకపోవడంతో ఈ ప్రచారం మొదలుపెట్టారా? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.ఇది రాజకీయ కుట్ర. కావాల‌నే కుమార్ విశ్వాస్ అరవింద్ కేజ్రీవాల్ యొక్క నకిలీ వీడియోను బయటపెట్టాడు. ఆ వెంటనే కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు మీడియా సమావేశాలు పెట్టి కేజ్రీవాల్‌ను టెర్రరిస్టు నిందించారు . ఇది ఒక పెద్ద డ్రామా..అన్నారు. కేజ్రీవాల్‌పై దుష్ప్ర‌చారం చేయ‌డానికి, ఓ ప‌ద్ధ‌తి ప్ర‌కారం ఇలా ప్ర‌చారాలు చేస్తున్నార‌ని ఆయ‌న తీవ్రంగా మండిప‌డ్డారు. 

ఇలాంటి అస‌త్య ప్ర‌చారాల‌ను పట్టించుకోవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆప్ లాంటి నిజాయితీ గల పార్టీ అధికారంలోకి వస్తే.. తమ అక్రమ సంపాదన మూలాలు మూతపడతాయని ఈ పార్టీలు భయపడుతున్నాయని అన్నారు. రాబోయే 72 గంటల్లో ఇలాంటి ప్రచారాలు మరిన్ని జరుగుతాయని, ఈ బూటకపు కథనాల జోలికి పోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు చద్దా. పంజాబీలు ఆమ్ఆద్మీతోనే వున్నార‌ని రాఘ‌వ్ చ‌ద్దా ధీమా వ్య‌క్తం చేశారు.

కేజ్రీవాల్ త‌న పాల‌న‌లో ప్రపంచ స్థాయి పాఠశాలలు, ఆసుపత్రులను నిర్మించార‌నీ, కేజ్రీవాల్ ఢిల్లీలో మహిళలకు ఇంటింటికీ రేషన్ సేవలను, ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించాడనీ. ఢిల్లీ ఎన్నికలకు ముందు కూడా ఇలానే నక్సలైట్, టెర్రరిస్ట్ అని పిలిచారని అన్నారు. కేజ్రీవాల్ ఉగ్రవాది కాదు, అతను జాతీయవాదని పేర్కోన్నారు. రాబోయే 72 గంటలు చాలా కీలకమ‌నీ, ఇలాంటి తప్పుడు ప్రచారం జరుగుతాయ‌ని ఓట‌ర్ల‌కు సూచించింది ఆప్.

కుమార్ విశ్వాస్ ఏమ‌న్నారంటే…

అర‌వింద్ కేజ్రీవాల్ పై ఆపార్టీ మాజీ నేత కుమార్ విశ్వాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏదో ఒక రోజు పంజాబ్ కు సీఎం అవుతానని, కాని పక్షంలో పంజాబ్ ను విడదీసి స్వతంత్ర దేశానికి (ఖలిస్థాన్) మొదటి ప్రధాని అవుతానని గతంలో తనతో అన్నాడని కుమార్ విశ్వాస్ అన్నారు. తాను మొద‌టి నుంచి చెబుతూనే వ‌స్తున్నాన‌నీ, వేర్పాటువాదులు ఖ‌లిస్తాన్ ఉద్య‌మానికి మ‌ద్ద‌తిచ్చే వారితో క‌ల‌వొద్ద‌ని తాను చెప్పాన‌నీ కుమార్ విశ్వాస్ అన్నారు. కేజ్రీవాల్ మాత్రం వారిని క‌లుస్తాన‌ని, ఏమీ ఆలోచించాల్సిన ప‌నిలేద‌న్నారు. అయితే వేర్పాటువాదుల‌తో చేతులు క‌ల‌పొద్ద‌ని తాను గట్టిగా చెప్పాన‌నీ, అధికారం కోసం కేజ్రీవాల్ ఏమైనా చేయ‌గ‌ల‌రని కుమార్ విశ్వాస్ విమ‌ర్శించారు.

మరో నాలుగు రోజుల్లో పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. కుమార్ విశ్వాస్(AAP Ex-leader) చేసిన ఈ వ్యాఖ్యలు దేశంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. కుమార్ విశ్వాస్ మాట్లాడిన వీడియోను బీజేపీ నేత అమిత్ మాళవియా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఒక వేళ ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లో అధికారంలోకి వస్తే ఇది ఎంతో ప్రమాదకరమని అమిత్ మాళవియా అన్నారు. ఆ త‌రువాత కాంగ్రెస్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కేజ్రీవాల్‌ని టెర్రరిస్టు అంటుంది.. ఆ తర్వాత ఓ ర్యాలీలో కేజ్రీవాల్‌ను టెర్రరిస్టు అని పిలుస్తాడు. ఈ నేతలంతా కేవలం అరవింద్ కేజ్రీవాల్‌ను అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారని రాఘవ్ చద్దా అన్నారు.