మహారాష్ట్రలో హునుమాన్ చాలీసా వివాదం ఇంకా సమిసిపోయినట్టు కనిపించడం లేదు. సీఎం ఉద్దవ్ ఠాక్రే నివాసమైన మాతో శ్రీ ఎదుట హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామని రాష్ట్రంలో అలజడి సృష్టించిన ఎంపీ నవనీత్ రాణా దంపతులు గత వారం బెయిల్ పై విడుదల అయ్యారు. అయితే బెయిల్ షరతులను వారు ఉల్లంఘించారని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ సందర్బంగా కోర్టు ఈ చట్టసభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఎంపీ నవనీత్ రాణా దంపతులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఇచ్చిన బెయిల్ నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంది. ఎమ్మెల్యే రవి రాణా, అతడి భార్య ఎంపీ నవనీత్ రాణాకు నోటీసులు జారీ చేసింది. ‘‘ మీ పై నాన్ బెయిలబుల్ వారెంట్ ఎందుకు జారీ చేయకూడదో తెలియజేయాలి’’ అని ఆ నోటీసులో కోర్టు పేర్కొంది.
రవి-నవనీత్ రాణాలు తమ చర్యల ద్వారా బెయిల్ షరతులను ఉల్లంఘించారని, కాబట్టి వారి బెయిల్ ను రద్దు చేయాలని ముంబై పోలీసులు అంతకు ముందు రోజు కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. ఆ జంటపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని పోలీసులు కోరారు. జైలుపై, అధికారులపై ఏవైనా ఫిర్యాదులు ఉంటే వారు మీడియాతో మాట్లాడటానికి బదులుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఉండాల్సిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రదీప్ ఘరత్ వాదించారు.
హనుమాన్ జయంతి రోజున సీఎం ఉద్ధవ్ ఠాక్రే హనుమాన్ చాలీసాను పఠించాలని అమరావతి లోక్‌సభ ఎంపీ నవనీత్ రాణా, అదే ప్రాంతంలోని బద్నేశా ఎమ్మెల్యే రవి రాణాలు (వీరిద్దరు స్వతంత్ర చట్ట సభ్యులు) సవాల్ విసిరారు. ఒక వేళ సీఎం ఠాక్రే హనుమాన్ చాలీసాను పఠించకుంటే.. తాము ఆయన ఇంటి (మాతో శ్రీ) ముందు హనుమాన్ చాలీసాను పఠిస్తామని పేర్కొన్నారు. ఈ సవాల్‌ను పలు మార్లు పునరుద్ఘాటించడంతో రాష్ట్రంలో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కాపాడటానికి పోలీసులు రంగంలోకి దిగారు. నవనీత్, రవి దంపతులకు ముంబాయి పోలీసులు నోటీసులు జారీ చేశారు.
వారిపై దేశద్రోహం, వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రేరేపించడం వంటి అభియోగాల కింద కేసు నమోదు చేశారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రత్యేక న్యాయస్థానం మే 4వ తేదీన ఈ దంపతులకు బెయిల్ మంజూరు చేసింది. ఇలాంటి నేరానికి పాల్పడకూడదని, మీడియాతో మాట్లాడకూడదని సహా కొన్ని షరతులు విధించింది. అయితే వారు పోలీసులపై ఆరోపణలు చేస్తూ మీడియాతో మాట్లాడారు. తమను పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో వేధించారని అన్నారు. దీంతో సబర్బన్ ఖార్ పోలీసులు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రదీప్ ఘరత్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు, మీడియాతో మాట్లాడకూడదనే షరతును ఉల్లంఘించినందున ఈ జంట బెయిల్‌ను కోర్టు రద్దు చేయాలని కోరారు.
“ నిందితులు (నవనీత్ రాణా, రవి రాణా) విడుదలైనప్పటి నుండి మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. వారికి బెయిల్ మంజూరు చేసేటప్పుడు ప్రత్యేక కోర్టు విధించిన షరతును ఉల్లంఘించారు. బెయిల్‌ను రద్దు చేయాలని, నిందితులకు వారెంట్ జారీ చేయాలని, వారిని వెంటనే కస్టడీలోకి తీసుకోవాలని మేము కోరుతున్నాము. ఎవరికీ నోటీసులు జారీ చేయాల్సిన అవసరం లేదు. కోర్టు కేవలం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని కోరుతున్నాం” అని ఘరత్ కోర్టుకు చెప్పారు. ఈ నేపథ్యంలోనే ముంబై సెషన్స్ కోర్టు నవనీత్ రాణా, రవి రాణాలకు నోటీసులు జారీ చేసింది. నాన్ బెయిలబుల్ వారెంటు ఎందుకు జారీ చేయకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
