భారత కరెన్సీ నోట్లపై గణేశుడి, లక్ష్మీ దేవత ఫొటోలు ముద్రించాలని ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కొత్త డిమాండ్‌ను తెరమీదకు తెచ్చారు. దీనికి కౌంటర్‌గా కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ పంచ్ విసిరాడు. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ఎందుకు వేయవద్దు? అంటూ అడిగారు.
న్యూఢిల్లీ: గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ.. బీజేపీపై పై చేయి సాధించడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నది. గుజరాత్‌లో విస్తృత ప్రచారం చేస్తున్నది. కేవలం దేవుళ్ల పేర్లు, దేవాలయాలకే వారి ప్రచారం పరిమితం కావడం లేదు. ఏకంగా కరెన్సీ నోట్లపైనా గణేశుడి బొమ్మ, లక్ష్మీ దేవత బొమ్మలు వేయాలని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది.
కొత్త కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీతోపాటు గణేశుడి, లక్ష్మీ దేవుళ్ల ఫొటోలనూ వేయాలని తాను కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నట్టు ఢిల్లీ సీఎం, ఆప్ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. దీనిపై కాంగ్రెస్ నేతలు మనీశ్ తివారీ, అభిషేక్ సింఘ్వీలు ట్విట్టర్‌లో రియాక్ట్ అయ్యారు.
కొత్త కరెన్సీ సిరీస్ నోట్లపై డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఫొటో ఎందుకు వేయవద్దు? అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత మనీశ్ తివారీ ట్వీట్ చేశారు. కరెన్సీకి ఒక వైపు మహాత్మా గాంధీ, మరో వైపు డాక్టర్ అంబేద్కర్ ఫొటో వేయాలని పేర్కొన్నారు. తద్వార అహింసా, రాజ్యాంగవాదం, సమతావాదాలను విజయవంతంగా ఒక చోట చేర్చినట్టు అవతుందని అభిప్రాయపడ్డారు. ఈ కలయిక ఆ ఆధునిక భారతీయుల తెలివిని సమర్థంగా వెల్లడించినట్టు ఉంటుందని తెలిపారు.
మనీశ్ తివారీ కంటే ముందూ అభిషేక్ సింఘ్వీ కూడా ఈ ఇష్యూ పై రియాక్ట్ అయ్యారు. సంపద, సౌభాగ్యానికి ప్రతీకలైన లక్ష్మీ దేవతను కరెన్సీ నోట్లపై ముద్రించడం అనుచితమైనదేమీ కాదని తెలిపారు. కానీ, పురాతనమైన విధానాలతో ఇందులో జోక్యం చేసుకుంటే.. అది ఇంతటితో ఆగదని వివరించారు. ఇతర రూపాలను నోట్లపై ముద్రించాలనే వాదనలు పెరుగుతాయని పేర్కొన్నారు.
కాగా, కేజ్రీవాల్‌కు కౌంటర్‌గా మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే కూడా రియాక్ట్ అయ్యారు. నితీష్ రాణే ఈ అంశంపై స్పందిస్తూ.. 200 రూపాయల నోటుపై ఛత్రపతి శివాజీ ఫొటోను చేర్చి ఒక నమూనాను ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
