చలి తీవ్రత పెరగనున్న కారణంగా మద్యం తాగకూడదని ఐఎండీ వెల్లడించిన విషయం తెలిసిందే. దీని మీద సర్వత్రా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఇలా అనడానికి గల కారణాలూ ఐఎండీ వెల్లడించింది. 

ఉత్తరాదిన రోజురోజుకు ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని, ఈనెల 28 నుంచి చలి తీవ్రత పెరగనున్నదని, మంచు కూడా అధికంగా కురియనుందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) హెచ్చరించింది. దీనికి తోడు ప్రస్తుత తరుణంలో మద్యం తాగొద్దని కూడా సూచించింది. 

ఇటువంటి సమయంలో విటమిన్ సి మాత్రలు, పండ్లు తీసుకోవాలని సలహా ఇచ్చింది. ఉత్తర భారతంలో చలి ప్రభావం అతి తీవ్రం కానున్నదని, ఆ సమయంలో మద్యం తాగడం ప్రమాదకరమని ఐఎండీ తెలిపింది. 

హర్యానా, పంజాబ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో ఈనెల 28 నుంచి అతి శీతల వాతావరణం ఏర్పడనుందని ఐఎండీ వెల్లడించింది. ఈ కారణంగా జ్వరాలు, జలుబు, ముక్కు దిబ్బడ, తదితర లక్షణాలు తలెత్తుతాయని పేర్కొంది. 

ఇట్లాంటి సమయంలో మద్యం తాగొద్దని, ఆల్కహాల్ ప్రభావంతో శరీర ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయని వివరించింది. ఆరోగ్యపరంగా ఈ మార్పు ఎంతో నష్టం కలుగజేస్తుందని పేర్కొంది. ప్రజలు ఇంటిపట్టునే ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించింది.