ప్రస్తుతం ఎక్కడ విన్నా.. డ్రగ్స్ కి సంబంధించిన వార్తలే వినపడుతున్నాయి. బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ దీపికా పదుకొణే, సారా అలీ ఖాన్, శ్రద్ధాకపూర్, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి వారికి డ్రగ్స్ కేసుతో సంబంధం ఉందంటూ.. వారికి ఎన్సీబీ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. సీనియర్ నటి, కాంగ్రెస్ పార్టీ మహిళా నేత నగ్మ.. షాకింగ్ కామెంట్స్ చేశారు.

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ పై నగ్మ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. కంగనా కూడా గతంలో డ్రగ్స్ తీసుకుందని.. మరి ఆమెకు ఎందుకు అధికారులు నోటీసులు పంపించలేదని ఆమె ప్రశ్నించారు.  బాలీవుడ్ సెలబ్రెటీల ఇమేజ్ ని దుర్వినియోగం చేయాలని ఎన్సీబీ అధికారులు ప్రయత్నిస్తున్నారని నగ్మ మండిపడ్డారు.

‘‘ గతంలో తాను డ్రగ్స్ తీసుకున్నట్లు అంగీకరించిన కంగనా రనౌత్‌ను ఎన్‌సిబి ఎందుకు పిలవలేదు. వాట్ యాప్ చాట్ ఆధారంగా మిగిలిన హీరోయిన్స్ అందరినీ పిలిచారు కదా?  ఆ హీరోయిన్స్ సమాచారం మీడియాకు ఎందుకు లీక్ చేశారు..? దాని వల్ల వారి ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేయాలని ఎన్సీబీ భావిస్తుందని అర్థం కాదా?’’ అంటూ నగ్మ తన ట్విట్టర్ లో ప్రశ్నించారు. 

 

ఇదిలా ఉండగా.. డ్రగ్స్ కేసులో ఇప్పటికే రియా చక్రవర్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను విచారించిన అనంతరం.. దీపికా పదుకొణే, సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్ లకు ఎన్సీబీ నోటీసులు జారీ చేశారు. వీరిని త్వరలోనే అధికారులు విచారించనున్నారు. బాలీవుడ్ యువనటుడు సుశాంత్ మరణం నేపథ్యంలో.. ఈ డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి రావడం గమనార్హం.

ఇదిలా ఉండగా.. గతంలోనూ నగ్మ, కంగనా ల మధ్య సోషల్ వార్ జరిగింది. సుశాంత్ చనిపోయిన సమయంలో నెపోటిజం మీద కంగనా తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. నగ్మ.. కంగనాపై విమర్శలు చేశారు.

‘కంగనా దీదీ కెరీర్‌ మొత్తం నెపోటిజం అనే పిల్లర్‌ మీదే ఆధారపడి ఉంది. ఎవరి సపోర్ట్‌ లేకుండానే బాలీవుడ్‌లో ఆమె ఈ స్థాయికి చేరుకుందా?’ అని ప్రశ్నిస్తూ కొన్ని మీమ్స్‌ చేసి ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ‘‘కంగనాను బాలీవుడ్‌కి పరిచయం చేసిన ఆదిత్యా పంచోలి, ‘గ్యాంగ్‌స్టర్‌’తో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చిన మహేశ్‌భట్‌ కూడా బంధుప్రీతితోనే అవకాశం ఇచ్చారా?’ అని నగ్మా ప్రశ్నించారు. ‘కంగనా కెరీర్‌ డౌన్‌ అయిన రెండు సందర్భాల్లో హృతిక్‌ రోషన్‌ రీ- లాంచ్‌ చేయడం కూడా నెపోటిజమేనా’ అని ఆమె అడిగారు.