ఆర్‌ఎస్‌ఎస్ మహిళలను అణిచివేస్తోందని, అందుకే ఆ సంస్థలో మహిళా సభ్యులు లేకపోవడానికి అదే కారణమని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. రాముడు , సీత దేవతలను అంగీకరించే బిజెపి , ఆర్‌ఎస్‌ఎస్..  'జై సియారామ్'కు బదులుగా 'జై శ్రీరాం' అని పిలిచి.. సీతాదేవిని అవమానిస్తున్నారని ఆరోపించారు.

బీజేపీ,ఆర్‌ఎస్‌ఎస్‌ లు మహిళలను అణచివేస్తోందని,వారు దేశవ్యాప్తంగా భయాన్ని వ్యాప్తి చేయాలని ప్రణాళిక రూపొందించుకున్నారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలోని భారత్ జోడో యాత్ర జోరుగా సాగుతోంది. ఇవాళ(గురువారం) ఉదయం దౌసా జిల్లాలోని లాల్సోట్ అసెంబ్లీ నియోజకవర్గం గోలియా గ్రామం నుంచి ప్రారంభమైంది. యాత్రలో రాహుల్ గాంధీ వెంట జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోటసార, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ గుర్జిందర్ సింగ్ రంధావా, వైద్య శాఖ మంత్రి పర్సాది లాల్ మీనా సహా పలువురు నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ భయాందోళనలకు గురిచేస్తున్నాయని అన్నారు. భారత ప్రజల గుండెల్లో భయాన్ని వ్యాప్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయని అన్నారు. అందుకే ఈ క్రమంలో నోట్ల రద్దు చేశారనీ, తప్పుడు జీఎస్టీ అమలు చేసి..చిరు వ్యాపారులను భయాందోళనకు గురి చేస్తున్నారని అన్నారు. మరోవైపు దేశంలో నిరుద్యోగభయం పెరుగుతోందనీ, ఈ భయాన్ని ఆసరాగా చేసుకుని BJP, RSS లు లబ్ది పొందుతున్నాయని అన్నారు. భయాన్ని ద్వేషంగా మార్చుకుంటారని అన్నారు. భయాన్ని ద్వేషంగా మార్చడమే వారి పని అని, వారి మొత్తం సంస్థలు అదే పని చేస్తాయని ఆరోపించారు. ఈ క్రమంలో దేశాన్ని విభజించే పనిలో పడ్డారని అన్నారు.

రాహుల్ గాంధీ ఇంకా మాట్లాడుతూ.. “ వారి(బీజేపీ) సంస్థలో మహిళలు కనిపించరు... ఆర్‌ఎస్‌ఎస్‌లో మహిళలు ఎందుకు కనిపించరు. వారు మహిళలను అణచివేస్తారు. మహిళలను అనుమతించరు. వారి సంస్థలోకి ప్రవేశాన్ని కల్పించరు. నేను ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి వారిని అడగాలనుకుంటున్నాను. మీరు జై శ్రీరామ్ అంటారు కానీ మీరు ఎందుకు జై సియారామ్ అనరు? సీతామాతను ఎందుకు తొలగించారు? మీరు ఆమెను ఎందుకు అవమానించారు? మీరు భారతదేశంలోని మహిళలను ఎందుకు అవమానించారు?" అని ప్రశ్నించారు. ఇకనుంచి'హే రామ్' 'జై సియారాం' అని నినాదించండని సూచించారు.

దేశంలో వ్యాప్తి చెందుతున్న భయం , ద్వేషానికి వ్యతిరేకంగా నిలబడటమే జోడో యాత్ర లక్ష్యమని ఆయన అన్నారు. భారతదేశంలోని 100 మంది ధనవంతుల సంపద.. దేశంలోని 55 కోట్ల మంది ప్రజల సంపదకు సమానమని ఆయన పేర్కొన్నారు. భారతదేశ సగం సంపద కేవలం 100 మంది వద్ద ఉందనీ, దేశం వారి కోసం నడుస్తుందని అన్నారు. మొత్తం ప్రభుత్వం, మీడియా, అన్ని బ్యూరోక్రాట్‌లు వారి ఇష్టానుసారం పనిచేస్తున్నాయని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీ కూడా వారి కోరిక మేరకు పనిచేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన 'భారత్ జోడో యాత్ర' రాజస్థాన్ మీదుగా సాగుతోంది. శుక్రవారంతో 100 రోజులు పూర్తి చేసుకోనుంది.