తెలంగాణ ఎంపీ రేణుకా చౌదరి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ కుక్కపిల్లను ఏకంగా పార్లమెంట్ కు తీసుకెళ్లారు … ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇలా ఎందుకు చేశారంట తెలుసా?
Renuka Chowdary : రేణుకా చౌదరి... తెలంగాణ రాజకీయాలపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసిన పేరు. కాంగ్రెస్ ఎంపీగా పనిచేస్తున్న ఈమె నిత్యం వివాదాల్లో ఉంటారు... వీటితోనే ఆమె ఫైర్ బ్రాండ్ గా గుర్తింపుపొందారు. తాజాగా రేణుకా చౌదరి మరో వివాదంలో చిక్కుకున్నారు... కానీ దీన్ని ఆమె చాలా ఈజీగా తీసుకుంటున్నారు.
అసలీ కుక్క వివాదమేమిటి?
ఇవాళ (డిసెంబర్ 1, సోమవారం) నుండి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రేణుకా చౌదరి ఓ కుక్కను తీసుకుని పార్లమెంట్ కు రావడం వివాదాస్పదంగా మారింది. ఆమె కారులో కుక్కను గమనించిన మీడియా ప్రతినిధులు వీడియో, ఫోటోలు తీశారు... ఇవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
పార్లమెంట్ కు కుక్కను తీసుకురావడం ప్రోటోకాల్ ను ఉళ్లంఘించడమేనని అధికార బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు. కానీ కుక్కను తీసుకురావడం తప్పేమీ కాదని... ఇలా చేయకూడదని చట్టాలేమైనా ఉన్నాయా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఈ కుక్కల కంటే భయంకరంగా అరిచేవాళ్లు, కరిచేవాళ్ళు పార్లమెంట్ లో ఉన్నారంటూ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు.
'' నేను పార్లమెంట్ కు వస్తుంటే ఒక స్కూటర్, కారు ఢీకొన్నాయి. ఆ సమయంలో అక్కడే ఈ కుక్కపిల్ల రోడ్డుపై తిరుగుతోంది. అక్కడే ఉంటే దానికి ఏదైనా అవుతుందని అనుకున్నాను... అందుకే దాన్ని కారులో ఎక్కించుకున్నాను. అలాగే పార్లమెంటుకు వచ్చాను... నేను కారుదిగి ఆ కుక్కను ఇంటికి పంపించేశాను. కారు వెళ్లిపోయింది, కుక్క కూడా వెళ్లిపోయింది. దీనిపై ఇంకా చర్చ ఎందుకు?'' అని రేణుకా చౌదరి అన్నారు.
''తాను తీసుకువచ్చిన కుక్క ప్రమాదకరం కాదు... నిజంగా కరిచేవాళ్లు పార్లమెంటులోనే కూర్చున్నారు. వాళ్లే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. మూగ జంతువును మేం చూసుకుంటే, ఇది పెద్ద సమస్యగా, చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వానికి వేరే పని లేదా? నేను కుక్కను ఇంటికి పంపి, ఇంట్లోనే ఉంచమని చెప్పాను... ప్రతిరోజూ పార్లమెంటులో కూర్చుని మమ్మల్ని కరిచే వాళ్ల గురించి మేం మాట్లాడం." అంటూ అధికారపార్టీ నాయకులకు చురకలు అంటించారు రేణుకా చౌదరి.


