Asianet News TeluguAsianet News Telugu

గులాం నబీ ఆజాద్ ఎందుకు రాజీనామా చేశారు? ఆయన చెప్పిన కారణాలేమిటీ?

గులాం నబీ ఆజాద్ రాసిన ఐదు పేజీల రాజీనామా లేఖలో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. ముఖ్యంగా రాహుల్ గాంధీపై ఘాటైన విమర్శలు చేశారు. 2014లో కాంగ్రెస్ ఓటమికి ప్రధానంగా ఆయన పిల్లచేష్టలే కారణం అని వివరించారు. అదే లేఖలో తాను రాజీనామా చేయడానికి గల కారణాలు వివరించారు.

why congress senior leader ghulam nabi azad quit party what his resignation letter says
Author
First Published Aug 26, 2022, 2:13 PM IST

న్యూఢిల్లీ: గులాం నబీ ఆజాద్ ఈ రోజు కాంగ్రెస్‌కు భారీ ఝలక్ ఇచ్చారు. ఆయన పార్టీ పదవులు అన్నింటితోపాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఐదు పేజీల రాజీనామా లేఖ రాశారు. ఇందులో పార్టీతో తన జీవిత ప్రయాణం గురించి, పార్టీ సాధించిన విజయాలు, అపజయాలను ప్రస్తావించారు. యూపీఏ 1, యూపీఏ 2 హయాంలో సోనియా గాంధీ తీరును మెచ్చుకుంటూనే ప్రస్తుత పరిణామాలపై విమర్శలు చేశారు. కొన్ని సూచనలూ చేశారు. కాగా, రాహుల్ గాంధీపై మాత్రం విరుచుకుపడ్డారు. ఆయన తన రాజీనామా లేఖలో పార్టీలో ప్రతికూల పరిస్థితులు, తప్పుడు పద్ధతులను ఎత్తి చూపారు. తన రాజీనామాకు పార్టీలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులనే కారణంగా చూపించారు. ఐదు పేజీల తన రాజీనామా లేఖలో ఎక్కువగా పార్టీపై ఘాటు విమర్శలు ఉన్నాయి. ఆయన పేర్కొన్న లోపాలను కారణంగా చూపి రాజీనామా చేస్తున్నట్టు వివరించారు.

రాహుల్ గాంధీ పిల్ల చేష్టల కారణంగా 2014లో కాంగ్రెస్ ఓడిపోయిందని తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే, ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పార్టీలో ఉండే సంప్రదింపుల వ్యవస్థను సర్వం నాశనం చేశారని మండిపడ్డారు. ఆయన చుట్టూ కొత్తగా సైకోల కోటరీ ఒకటి ఏర్పడిందని, ఇప్పుడు వారే పార్టీ వ్యవహారాలను నడుపుతున్నారని విమర్శించారు. ఆయన గార్డులు, పర్సనల్ అసిస్టెంట్లు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని తీవ్రంగా ఆరోపించారు.

ఒకప్పుడు కాంగ్రెస్ అంటే జాతీయ ఉద్యమం.. దేశ స్వాంత్ర్యం కోసం పోరాడిన పార్టీ అని గుర్తు చేస్తూ.. ఇప్పుడు కొందరు ఆ పార్టీని శాశ్వతంగా తమ గుప్పిట్లో ఉంచుకోవాలని పరితపిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. వ్యవస్థాగత ఎన్నికలు కేవలం ఉట్టి మాయ అని విమర్శించారు. ఒక వేళ గాంధీయేతరులను అధ్యక్షులుగా ఎన్నుకున్న వారు కీలు బొమ్మకు మించి మరేమీ కాదని స్పష్టం చేశారు.

సెప్టెంబర్ 7 నుంచి రాహుల్ గాంధీ సారథ్యంలో నిర్వహించే భారత్ జోడో యాత్రకు ముందు కాంగ్రెస్ జోడో అనే కార్యక్రమాన్ని ప్రస్తుత నాయకత్వం చేయాలని ఘాటైన వ్యాఖ్యలు సోనియా పై సంధించారు. 2019 నుంచి సోనియా గాంధీ నామమాత్రపు చీఫ్‌గా ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని స్థితికి వెళ్లిపోయిందని అభిప్రాయపడ్డారు. యూపీఏ ప్రభుత్వాన్ని నాశనం చేసిన రిమోట్ కంట్రోల్ విధానమే ఇప్పుడు పార్టీకి కూడా అమలు చేస్తున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్‌కు ఉన్న రాజకీయ పరిధిని బీజేపీకి అప్పగించామని, రాష్ట్ర స్థాయిల్లో పార్టీ స్పేస్‌ను ప్రాంతీయ పార్టీలకు సమర్పించుకున్నామని పేర్కొన్నారు. ఎనిమిదేళ్లలో జరిగిన ఈ దుస్థితికి కారణంగా పార్టీ నాయకత్వాన్ని బ్లేమ్ చేశారు. అసలు సీరియస్‌గా లేని ఓ వ్యక్తికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలనే పెనుగులాటతోనే ఈ కాలం అంతా గడిచిందని, అదే సమయంలో పార్టీ తీవ్రంగా నష్టపోయిందని వివరించారు.

ఏఐసీసీని నడుపుతున్న కొత్తగా ఏర్పడ్డ కోటరీ కారణంగా కాంగ్రెస్ పార్టీ సామర్థ్యం, ఆత్మవిశ్వాసం కూడా కోల్పోయిందని ఆయన పేర్కొన్నారు. ఈ అన్ని కారణాల రీత్యా తాను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు గులాం నబీ ఆజాద్ వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios