అజాన్ ప్రార్థనలు చేయడానికి లౌడ్ స్పీకర్లు ఎందుకు? లౌడ్ స్పీకర్లు వాడితేనే అల్లాకు వినిపిస్తుందా? అంటే అల్లాకు చెవుడా అని కర్ణాటక మాజీ మంత్రి, సీనియర్ బీజేపీ నేత కేఎస్ ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

బెంగళూరు: కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సున్నితమైన మతపరమైన వ్యాఖ్యలు చేసి అజాన్ ప్రార్థన పై మరోసరి వివాదాన్ని, చర్చను తెరతీశారు. ‘అజాన్ ప్రార్థనలను లౌడ్ స్పీకర్లలో ఎందుకు చేయాలి? లౌడ్ స్పీకర్‌లలో చేస్తేనే అల్లాకు వినిపిస్తుందా? అంటే అల్లాకు చెవిటా?’ అని అడిగి వివాదాన్ని రేపారు.

సీనియర్ బీజేపీ నేత, మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ సమావేశంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతుండగా సమీపంలోని మసీదు నుంచి అజాన్ ప్రార్థన లౌడ్ స్పీకర్‌లో వినిపించింది. ‘ఎక్కడికెళ్లినా.. ఇది (అజాన్ ప్రార్థన) నాకు తలపోటును ఇస్తూనే ఉన్నది’ అని అన్నారు. ‘సుప్రీంకోర్టు తీర్పు వెలువడాల్సి ఉన్నది. ఇవాళ కాకుంటే రేపు.. త్వరలోనే అజాన్ ప్రార్థనలకు ఎండ్ కార్డ్ పడే రోజు వస్తుంది’ అని తెలిపారు.

అంతటితో ఆగలేదు. లౌడ్‌స్పీకర్లు వాడితేనే అల్లా ప్రార్థనలు వింటాడా? అని బీజేపీ నేత ప్రశ్నించారు. ‘దేవాలయాల్లో యువతులు, మహిళలు తమ ప్రార్థనలు, భజనలు చేస్తుంటారు. మనం కూడా మతస్తులమే. కానీ, మనం లౌడ్‌స్పీకర్లు ఉపయోగించం. మీరు ప్రార్థనలు చేయడానికి లౌడ్ స్పీకర్లు అవసరం పడతాయంటే.. దాని అర్థం అల్లాకు చెవులు వినిపించవనేనా’ అని అన్నారు.

Also Read: మధ్యాహ్నం 12 గంటల దాకా పడుకుంటుంది, వంట చేయదు: భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త

కర్ణాటకకు డిప్యూటీ సీఎంగా కూడా చేసిన ఈశ్వరప్ప వివాదాలకు కొత్తేమీ కాదు. గతంలో ఓ సారి 18వ శతాబ్ది మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ పేరును పేర్కొంటూ అతనో ముస్లిం గూండా అని వివాదాన్ని రేపారు.

కర్ణాటకలో ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్యతో ఈశ్వరప్ప మంత్రి పదవికి రాజీనామా చేశారు. తన ఆత్మహత్యకు పూర్తిగా ఆయనే బాధ్యుడు అని కాంట్రాక్టర్ తన సూసైడ్ లెటర్‌లో పేర్కొన్నారు.