కేంద్ర హోం శాఖ సహాయమంత్రిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రివర్గంలో తన ప్రాధాన్యాన్ని పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పటికే తన పనితీరుతో అమిత్ షా కళ్లలో పడిన ఆయనపై ప్రధాని మోడీకి సైతం సంతృప్తి కలిగింది.

ఈ క్రమంలోనే హోంమంత్రి అమిత్ షా ఆయనకు మరిన్ని అదనపు బాధ్యతలు కట్టబెట్టారు. వామపక్ష తీవ్రవాద విభాగం, పోలీస్ శాఖ ఆధునికీకరణ, మహిళల భద్రత, జమ్మూకశ్మీర్ వ్యవహారాలు, అంతర్గత భద్రత, జ్యూడిషనల్ డివిజన్,  స్వాతంత్ర్య సమరయోధుల పునరావాస బాధ్యతలు అప్పగించారు.

ఇంతటి ప్రాధాన్యత కలిగిన విభాగాలను కిషన్ రెడ్డికి ఇంత త్వరగా రావడానికి కారణం ఏంటనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో పార్టీ పటిష్టతకు కిషన్ రెడ్డి సేవలను బీజేపీ అధిష్టానం ఉపయోగించుకోవాలని చూస్తోంది.

దీనిలో భాగంగానే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు కమలనాథులు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హోదాలో ఆయన రెండు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించే అవకాశం ఉంది.

మరోవైపు దేశభద్రతకు సంబంధించి అనేక అంశాలను ఇప్పుడిప్పుడే అధ్యయనం చేస్తున్నారు కిషన్ రెడ్డి. బీజేపీ యువమోర్చాతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది.

అన్నింటికి మించి గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందే కిషన్ రెడ్డి-మోడీల మధ్య అనుబంధం ఉంది.. పార్టీ కార్యకర్తలుగా ఇద్దరు విదేశాల్లో కలిసి పర్యటించారు.

ఈ మధ్యకాలంలో ఏపీకి చెందిన నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులను బీజేపీ గూటికి చేర్చడం వెనుక ఆయన కీలకంగా వ్యవహరించారు. పార్లమెంట్ సభ్యుడిగా ప్రమాణం చేసే సమయంలో కిషన్ రెడ్డి వందేమాతరం, భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేసి తన దేశభక్తిని చాటుకుని, అందరిని ఆకట్టుకున్నారు.

వీటన్నింటి దృష్ట్యా సమర్ధుడైన నేతగా అమిత్ షా కంట్లోపడ్డారు. ఇక  దేశంలోని మహిళలకు భద్రతతో పాటు వారికి సత్వరమే న్యాయాన్ని అందించేందుకు కేంద్ర హోంశాఖ 2018లో మహిళా భద్రతా విభాగాన్ని ఏర్పరచింది.

మరో కీలక విభాగం జ్యూడిషల్.. ఇండియన్ పీనల్ కోడ్‌లోని వివిధ చట్టసభల అంశాలు ఈ విభాగం పరిధిలోకి వస్తాయి. అంతేకాకుండా క్రిమినల్ ప్రోసీజర్ కోడ్, కమీషన్ ఆఫ్ ఎంక్వైరీలు కూడా ఈ విభాగం కిందకే వస్తాయి. ఇంతటి కీలక విభాగాలు కిషన్ రెడ్డి నియంత్రించాల్సి ఉంటుంది.