కోవిడ్ వల్ల 2020 జనవరి నుంచి 2021 డిసెంబర్ వరకు ప్రపంచ వ్యాప్తంగా మరణించిన వారి సంఖ్యను WHO గురువారం విడుదల చేసింది. ఈ నివేదికలో భారత్ మరణాలను కూడా పేర్కొంది. అయితే ఈ గణాంకాలపై భారత ప్రభుత్వం అభ్యంతరాలు లేవనెత్తింది. ఈ లెక్కలు సరిగా చేపట్టలేదని చెప్పింది.  

క‌రోనా.. ఇది మాన‌వుల‌కు ప‌రిచయం అయిన ద‌గ్గ‌ర నుంచి ప్ర‌పంచం అంతా గంద‌ర‌గోళం. ఈ మ‌హ్మ‌మారి ప్ర‌భావం వ‌ల్ల జ‌న జీవ‌నం అస్త‌వ్య‌స్తంగా తయారైంది. ఎంతో మంది త‌మ ఆత్మీయుల‌ను కోల్పోయారు. మ‌రెంతో మంది త‌మ ఉపాధిని కోల్పొయారు. ఈ కోవిడ్ అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో మంది చ‌నిపోయారు. అయితే భార‌త్ లో కూడా ల‌క్ష‌ల మంది చ‌నిపోయారు. 

భార‌త్ లో కరోనా మ‌ర‌ణాల‌ లెక్క‌ల‌పై గురువారం ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (WHO) గ‌ణాంకాలు విడుద‌ల చేసింది. అయితే ఈ గ‌ణాంకాల‌పై కేంద్ర ప్ర‌భుత్వం అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. దీనికి కార‌ణం ఏంటంటే భార‌త ప్ర‌భుత్వం అధికారికంగా వెల్ల‌డించిన మ‌ర‌ణాల కంటే డ‌బ్లూహెచ్ వో నివేదించిన మ‌ర‌ణాలు ప‌ది రేట్లు అధికంగా ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ గురువారం విడుద‌ల చేసిన గ‌ణాంకాల ప్ర‌కారం ప్ర‌పంచ వ్యాప్తంగా 14.9 మిలియన్ల మంది ప్రజలు నేరుగా COVID-19 వల్ల లేదా దాని ప్ర‌భావం వ‌ల్ల ఇతర అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో మ‌ర‌ణించార‌ని తెలిపింది. భార‌త్ లో కూడా 4.7 మిలియ‌న్ల మంది చనిపోయార‌ని పేర్కొంది. 

డ‌బ్లూహోచ్ వో గ్లోబల్ హెల్త్ ఏజెన్సీ అంచనా ప్రకారం భారతదేశంలో 2020 జనవరి నుంచి 2021 డిసెంబ‌ర్ మ‌ధ్య కాలంలో 4.7 మిలియన్ల కోవిడ్ మరణాలు సంభవించాయి. అయితే ఇది భారతదేశ అధికారిక మ‌ర‌ణాల సంఖ్య కంటే 10 రేట్లు ఎక్కువ. అలాగే ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మరణాలలో మూడో వంతు. అయితే WHO నివేదిక మోడల్‌ను కేంద్ర ప్ర‌భుత్వం త‌ప్పుప‌ట్టింది. ప్రామాణికమైన డేటా లభ్యత దృష్ట్యా కరోనావైరస్ మహమ్మారితో సంబంధం ఉన్న అదనపు మరణ అంచనాలను ప్రవేశపెట్టడానికి WHO గణిత నమూనాలను ఉపయోగించడాన్ని భారత్ తీవ్రంగా వ్య‌తిరేకించింది. 

ఈ గ‌ణాంకాల కోసం ఉపయోగించిన మోడల్‌ల చెల్లుబాటు, దృఢత్వం, డేటా సేకరణ పద్ధతి సందేహాస్పదంగా ఉన్నాయని భారత ప్రభుత్వం పేర్కొంది. దేశంలో జనన మరణాల నమోదు వ్యవస్థ చాలా పటిష్టంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (CRRS) ద్వారా రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రచురించిన ప్రామాణికమైన డేటా లభ్యత దృష్ట్యా, భారతదేశానికి అధిక మరణాల సంఖ్యను అంచనా వేయడానికి గణిత నమూనాను ఉపయోగించకూడదు. పాజిటివిటీ రేటు కూడా సరిగ్గా అంచనా వేయలేద‌ని చెప్పింది. భారతదేశంలో కోవిడ్-19 కోసం టెస్ట్ పాజిటివిటీ రేటు (WHO ఉపయోగించే మరొక కీలక వేరియబుల్) ఏ సమయంలోనైనా దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉండదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎత్తి చూపింది. స్థలం, సమయం రెండింటిలోనూ కోవిడ్ పాజిటివిటీ రేటులోని వైవిధ్యాన్ని పరిగణనలోకి తీసుకోవడంలో డ‌బ్లూహెచ్ వో విఫలమైంద‌ని చెప్పింది. మోడల్ రేటును కూడా పరిగణనలోకి తీసుకోవడంలో విఫలమైంద‌ని తెలిపింది. WHO నివేదించిన గణాంకాలు వాస్తవికతను పూర్తిగా విస్మరించాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.