కేంద్ర ప్రభుత్వం కరోనా టెస్టులకు సంబంధించి  కీలక సూచనలు చేసింది. అందరూ కరోనా టెస్టులు చేసుకోవాల్సిన అవసరం లేదని వివరించింది. కరోనా సోకిన వారి కాంటాక్టు జాబితాలో ఉన్నప్పటికీ హై రిస్కు అయితే తప్పా టెస్టు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. దగ్గు, జ్వరం, ఇతర లక్షణాలు కనిపించిన వారు మాత్రం తప్పకుండా టెస్టు చేసుకోవాలని సూచించింది. కరోనా టెస్టు కోసం డెలివరీలు, ఇతర ముఖ్యమైన సర్జరీలను వాయిదా వేయరాదని వెల్లడించింది.

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు(Corona Cases) పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ నలుమూలలకు విస్తరించింది. ఎవరికి జలుబు చేసినా.. జ్వరం వచ్చినా కరోనా వైరస్ సోకిందా? అనే సందేహాలు అలుముకుంటున్నాయి. అందుకే చాలా మంది సంశయాలతోనూ టెస్టులు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక సూచనలు(Suggestions) చేసింది. ఎవరు కచ్చితంగా టెస్టు(Corona Test) చేసుకోవాలి? ఎవరు టెస్టులు చేసుకోవాల్సిన అవసరం లేదు? అనే విషయంపై ఐసీఎంఆర్(ICMR0 వివరణ ఇచ్చింది. కరోనా పేషెంట్లకు కాంటాక్టులుగా ఉన్నప్పటికీ హై రిస్క్ లేకుంటే టెస్టు చేసుకోవాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్ తెలిపింది. ఇక్కడ హై రిస్క్ అంటే.. వయోధికులు లేదా దీర్ఘకాలిక వ్యాధులుగా గుర్తించాలి. వీరితోపాటు ఎలాంటి లక్షణాలే లేని వారు చేసుకోవాల్సిన పని లేదని సూచించింది. హోం ఐసొలేషన్ నిబంధనల ప్రకారం, డిశ్చార్జ్ అయినట్టుగా పేర్కొంటున్నదో వారూ కూడా కరోనా టెస్టు చేసుకోనక్కర్లేదని తెలిపింది. వేరే రాష్ట్రాలకు ప్రయాణం అవుతున్న వారు కూడా కరోనా టెస్టు చేసుకోవాల్సిన అవసరం లేదని వివరించింది.

ఎవరు టెస్టు చేసుకోవాలి?
కాగా, దగ్గు, జ్వరం, గొంతు పొడిబారిన వారు, రుచి, వాసన గుణాలు పసిగట్టలేకపోయినవారు, ఊపిరాడటం సమస్యగా మారినవారు, ఇతర శ్వాసకోశ సంబంధ సమస్యలు ఉన్నవారు కరోనా టెస్టు చేసుకోవాలని ఐసీఎంఆర్ ఓ ప్రకటనలో వెల్లడించింది. అలాగే, విదేశాల నుంచి భారత విమానాశ్రయాలకు చేరిన వారు, సముద్ర పోర్టులకు వచ్చిన వారు టెస్టు చేసుకోవాలని తెలిపింది.


కరోనా టెస్టు కోసం వీటిని వాయిదా వేయవద్దు?
అంతేకాదు, కరోనా టెస్టు చేయలేదని, లేదా టెస్టు రిజల్ట్ రాలేదని మెడికల్ సంబంధ ముఖ్యమైన పనులను వాయిదా వేయరాదని ఐసీఎంఆర్ వెల్లడించింది. సర్జరీలు, డెలివరీలు వంటి ఎమర్జెన్సీ పనులను కరోనా టెస్టుల కోసం వాయిదా వేయరాదని స్పష్టం చేసింది. టెస్టింగ్ ఫెసిలిటీ లేదని పేషెంట్లను వేరు హాస్పిటళ్లకు రిఫర్ చేయరాదని వివరించింది. అంతేకాదు, లక్షణాలు కనిపించకుంటే హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన గర్భిణిలు, ఇతర ఆపరేషన్ల కోసం అడ్మిట్ అయిన వారికి టెస్టు చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది.

అంతేకాదు, ఒమిక్రాన్ వేరియంట్‌ లేదా ఇతర వేరియంట్లను నిర్ధారించే జీనోమ్ సీక్వెన్సింగ్ కేవలం సర్వెలెన్స్ కోసమేనని ఐసీఎంఆర్ తెలిపింది. అంతేకానీ, దీన్ని ట్రీట్‌మెంట్ కోసం భావించరాదని పేర్కొంది. ఇండియన్ సార్స్ కోవ్2 జీనోమిక్ సర్వెలెన్స్ కన్సార్టియం(ఐఎన్ఎస్ఏసీవోజీ) నిబంధనల ప్రకారమే.. పాజిటివ్ పేషెంట్ల శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపిస్తారని వివరించింది.

తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,79,723 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం బులిటెన్‌ను విడుదల చేసింది. తాజాగా కరోనాతో 146 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,83,936కి చేరింది. నిన్న దేశవ్యాప్తంగా కరోనా నుంచి 46,569 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 3,45,00,172కి చేరింది. ఇక, ప్రస్తుతం దేశంలో 7,23,619 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారి పాజిటివిటీ రేటు 13.29 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.