సారాంశం

మధ్యప్రదేశ్‌లో కునో నేషనల్ పార్క్‌లోని ఆశా అనే ఆడ చిరుతను ట్రాక్ చేసే అటవీ శాఖ బృందాన్ని సమీప గ్రామస్తులు బందిపోట్లుగా పొరబడ్డారు. వారు ఎంత చెప్పినా వినిపించుకోకుండా దాడి చేశారు. ఆ తర్వాత రెండో టీమ్ స్పాట్‌కు వచ్చింది.
 

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ గత కొన్ని నెలలుగా తరుచూ వార్తల్లోకి ఎక్కుతున్నది. తొలుత ఆ నేషనల్ పార్క్‌లో దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన పులులను ప్రవేశపెట్టడం.. ఆ తర్వాత పులులు మరణించడం సెన్సేషనల్ న్యూస్‌గా బయటకు వచ్చాయి. ఇప్పుడు మరో వార్త కునో నేషనల్ పార్క్ కేంద్రంగా వచ్చింది. కునో నేషనల్ పార్క్‌లో వదిలిన ఆశా అనే చిరుత పులిని ట్రాక్ చేయడానికి నలుగురు సభ్యుల బృందం తెల్లవారుజామున నాలుగు గంటలకు తిరుగుతుండగా.. అక్కడి గ్రామస్తులు వారిని అనుమానాస్పదంగా చూశారు. వారు దోచుకోవడానికి వచ్చిన బందిపోట్లుగా భావించారు. తాము బందిపోట్లం కాదని, అటవీ శాఖ అధికారులమని ఎంత చెప్పినా వారు వినిపించుకోలేదు. వారిపై దాడి చేశారు. దీంతో మరో టీమ్ అక్కడికి రావాల్సి వచ్చింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురి జిల్లా కునో నేషనల్ పార్క్ సమీప గ్రామంలో చోటుచేసుకుంది.

ఆశా చిరుత ప్రొటెక్టెడ్ ఏరియా నుంచి బయటకు వచ్చింది. దీంతో దాన్ని ట్రాక్ చేయడానికి నలుగురు సభ్యుల టీమ్ గాలిస్తూ తిరిగింది. సుమారు ఉదయం 4 గంటల ప్రాంతంలో వారిని గ్రామస్తులు చూశారు. పట్టుకుని నిలదీశారు. ఈ ఏరియాలో చీకటిలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తాము ఒక ఆడ చిరుత కోసం గాలిస్తున్నామని, దాన్ని గాలిస్తూ ఇక్కడి దాకా వచ్చామని చెప్పినా వారు విశ్వసించలేదు. వారు కచ్చితంగా బందిపోట్లేనని భావించి దాడి చేశారు.

Also Read: Har Shikhar Tiranga: ప్రతి శిఖరంపై త్రివర్ణ పతాకం.. రక్షణ మంత్రిత్వ శాఖ కొత్త ప్రోగ్రామ్

ఈ ఘటన ఓ ఫారెస్ట్ వర్కర్‌(పవన్ అగర్వాల్)కు గాయాలయ్యాయి. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వెహికిల్ కూడా ఈ దాడిలో ధ్వంసమైంది.

ఈ దాడి తర్వాత బాధితులు కునో నేషనల్ పార్క్ అధికారులకు సమాచారాన్ని చేరవేశారు. దీంతో ఆ లొకేషన్‌కు మరో టీమ్ బయల్దేరి వచ్చింది.

కునో నేషనల్ పార్క్ డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ ప్రకాశ్ కుమార్ వర్మ ఈ ఘటనపై స్పందించారు. చిరుత పులిని ట్రాక్ చేస్తున్న తమ టీమ్‌ను గ్రామస్తులు దాడి చేశారని వివరించారు. ఆ దాడిలో ఒక ఫారెస్ట్ వర్కర్ గాయపడ్డాడనీ తెలిపారు. పొహారి పోలీసు స్టేషన్‌లో ఈ ఘటనకు సంబంధించి కేసు పెట్టామని వివరించారు.