పెళ్లి మండపంలో పురోహితుడు మంత్రాలు ఉచ్ఛరిస్తూ పెళ్లి కూతురు మెడలో వరమాల వేయాల్సిందిగా వరుడికి చెప్పాడు. వరుడు అలాగేనని వరమాలను వధువు మెడలో వేశాడు. వరమాల వేస్తుండగా వరమల చేయి తన మెడకు తగిలిందని వధువు రుసరుసలాడింది. పెళ్లి మండపంలోనే ఫైర్ అయింది. అక్కడి నుంచి లేచి వెళ్లింది. ఆ తర్వాత ఇరుపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు పెళ్లే రద్దు అయింది.
బెంగళూరు: పెళ్లి చూపులు మొదలు.. అప్పగింతలు అయ్యే వరకు పెళ్లి చుట్టూ అనేక రకాల ఈగోలు ఉంటాయి. ముఖ్యంగా పెళ్లి కొడుకు తరఫు వాళ్లు పై చేయి కోసం పరితపిస్తుంటారు. ఎవరూ తక్కువ కాదు అనేలా పెళ్లి కూతురు వారు ప్రయత్నిస్తుంటారు. ఈ ఈగోలు ఒక్కోసారి పెళ్లి రద్దు అయ్యే వరకూ వెళ్తుంటాయి. కానీ, కర్ణాటకలో ఓ పెళ్లి సిల్లీ రీజన్‌తో క్యాన్సిల్ అయింది. వరుడు పూల మాల వేస్తుండగా వధువు మెడకు ఆయన చేయి తగిలిందని ఆమె గగ్గోలు పెట్టింది. మెడకు చేయి తగిలినందుకే ఆగ్రహిస్తూ.. పెళ్లి మండపం వదిలి బయటకు వెళ్లిపోయింది. దీంతో పెళ్లి కొడుకు తరఫు వారు షాక్ అయ్యారు. కేవలం చేయి తగిలినందుకే ఇంత రాద్ధాంతం చేస్తుందా? అని మండిపడ్డారు. ఆమె రూడ్ బిహేవియర్‌ను తప్పుపట్టారు. ఓ అడుగు ముందుకు వేసి పెళ్లే అక్కరలేదని అనేశారు.
కర్ణాటకలో నారావి పట్టణంలోని బేల్తంగడి తాలూకాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు మండపానికి వచ్చారు. పెళ్లి తంతు మొదలైంది. దాదాపు చివరకు వస్తుండగా.. పురోహితుడు వరమాలను వధువు మేడలో వేయాలని వరుడికి సూచించాడు. వరుడు లేచి వరమాలను వధువు మెడలో వేశాడు. ఆ పూల మాల వేస్తుండగా ఆమె మెడకు వరుడి చేయి తగిలింది. దీంతో ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తన బాడీని తాకాడని రచ్చ చేసింది. పెళ్లి మండపంలోనే నానా రభస చేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. పెళ్లి మండపం నుంచి అర్ధంతరంగా ఆమె వెళ్లిపోవడాన్ని వరుడి కుటుంబం జీర్ణించుకోలేదు.
వధువు ప్రవర్తనను చూసి పెళ్లినే రద్దు చేసుకోవాలని వరుడి కుటుంబం డిసైడ్ అయింది. పెళ్లిని రద్దు చేసుకుంటామని తెలిపారు. దీంతో ఆగ్రహంలోనే ఉన్న వధువు.. వరుడి కుటుంబంపైనా మండిపడింది. అలాగైతే.. ఈ పెళ్లికి తమ కుటుంబం పెట్టిన ఖర్చు అంతా ఇచ్చేయాలని డిమాండ్ చేసింది. దీంతో పెళ్లి కొడుకు కుటుంబం కూడా సీరియస్ అయింది. ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ విషయం పోలీసుల వరకూ వెళ్లింది. పోలీసులు స్పాట్‌కు వెళ్లారు. వారికి సర్ది చెప్పారు. ఇరుపక్షాలను కూర్చోబెట్టి పెళ్లి గురించి మాట్లాడుకోవడానికి ప్రయత్నాలు చేశారు. కానీ, ఇరుపక్షాలు పెళ్లి వద్దనే పట్టుబట్టాయి.
ఈ పెళ్లి కోసం సుమారు 500 మంది అతిథులకు భోజనం సిద్ధం చేశారు. పెళ్లి రద్దు కావడంతో ఆ భోజనాన్ని స్థానికంగా ఉన్న ఓ పాఠశాలకు పంపినట్టు సమాచారం.
