నైరుతి రుతుపవనాలు అనుకున్నట్టుగానే ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ తాజాగా వెల్లడించింది. వచ్చే మూడు రోజుల్లో ఈ నైరుతి రుతుపవనాలు కేరళతోపాటు తమిళనాడు, కర్ణాటక సహా మరికొన్ని రాష్ట్రాలకు వ్యాపించే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో మరో ఐదు రోజుల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 

న్యూఢిల్లీ: వర్షాకాలం సమీపించింది. నైరుతి రుతుపవనాలు రోజుల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా విస్తరించనున్నాయి. ఎప్పటి కంటే.. ఈ సారి నైరుతి రుతుపవనాలు ముందుగానే కేరళ తీరాన్ని తాకుతాయని ఐఎండీ ఇది వరకే అంచనా వేసిన సంగతి తెలిసిందే. జూన్ 1వ తేదీ కంటే మూడు రోజులు ముందే అంటే మే 29వ తేదీనే నైరుతి రుతుపవనాలు కేరళను చేరుతాయని పేర్కొంది. తాజాగా, మంగళవారం వాతావరణ శాఖ కీలక విషయాలను వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తాజాగా తెలిపింది.

వచ్చే రెండు మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళతోపాటు తమిళనాడు, కర్ణాటక, ఈశాన్య రాష్ట్రాలకు వ్యాపించే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ తెలిపింది. పశ్చిమ నుంచి బలంగా వీస్తున్న గాలుల కారణంగా చాలా రాష్ట్రాల్లో నైరుతి రుతపవనాల వర్షాలతోపాటు ఉరుములు, మెరుపులు కూడా ఉంటాయని పేర్కొంది. చాలా రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వివరించింది. 

ఇదిలా ఉండగా, వచ్చే ఐదు రోజుల్లోపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోనూ వర్షాలు పడుతాయని ఐఎండీ అంచనా వేసింది. కేరళ, మాహె, లక్షద్వీప్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్‌లలో ఐదు రోజుల్లోపు వర్షాలు కురుస్తాయని వివరించింది. మే 31న కేరళ, మాహె, తమిళనాడుల్లోని కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. కాగా, జూన్ 2వ, 3వ తేదీల్లో ఈ ప్రాంతాలు సహా తీర, దక్షిణ కర్ణాటకలోనూ వర్షాలు మంచిగా కురుస్తాయని వివరించింది.

కేరళ తీరం, లక్షదీవులు, కమోరిన్ ఏరియా, మన్నార్ గల్ఫ్‌లలో జూన్ 2వ, 3వ తేదీల్లో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉన్నదని ఐఎండీ తెలిపింది. ఈశాన్య రాష్ట్రాలు, సబ్ హిమాలయన్ వెస్ట్ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లోనూ వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలు ఉన్నాయని వివరించింది. 

కాగా, రానున్న ఐదు రోజుల్లో బిహార్, జార్ఖండ్, ఒడిశా, గంగా తీరంలోని పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలంగా వీచే గాలులతో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.

మిజోరం, త్రిపుర, సిక్కిం, అసోం, మేఘాలయల్లో మే 31 నుంచి జూన్ 4వ తేదీ వరకు కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. కాగా, జూన్ తొలి వారాల్లో అరుణాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షం కురుస్తుందని వివరించింది. 

తాజా ఐఎండీ సూచనల్లో రానున్న ఐదు రోజుల్లో వడగాలులకు సంబంధించిన హెచ్చరికలు లేకపోవడం గమనార్హం.