National Anthem-madrasas: మదర్సాలలో జాతీయ గీతాన్ని తప్పనిసరి చేస్తూ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. దీనిపై ప‌లు వ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. దీనిపై కేంద్ర మంత్రి సాధ్వి నిరంజ‌న్ జ్యోతి స్పందిస్తూ.. జాతీయ గీతం ఆల‌పించ‌డానికి ఎంటీ స‌మ‌స్య అని ప్ర‌శ్నించారు.  

Uttar Pradesh: రాష్ట్రంలోని అన్ని మదర్సాలలో జాతీయ గీతాన్ని తప్పనిసరి చేస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రశ్నలను లేవనెత్తినందుకు వారిపై కేంద్ర ఆహార శాఖ స‌హాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాన్పూర్ లో ఓ అధికారిక కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డానికి వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ పై వ్యాఖ్య‌లు చేశారు. "స్వాతంత్య్ర పోరాటానికి జాతీయ గీతం, వందేమాతరం ఆలపించి ప్రజలు తమ ప్రాణాలను అర్పించారు. ఈ రోజు జాతీయ గీతం పాడటానికి ఎందుకు ఈ ఇబ్బంది? ప్రజలు ఎక్కడ నివసిస్తున్నారో ఆ దేశ‌ జాతీయ గీతాన్ని ఆలపించాల్సి ఉంటుంది" అని కేంద్ర మంత్రి సాధ్వి నిరంజ‌న్ జ్యోతి అన్నారు. 

అలాగే, వారణాసి కోర్టు ఆదేశించిన కాశీ విశ్వనాథ దేవాలయం-జ్ఞాన్‌వాపి మసీదు సముదాయం సర్వే గురించి కూడా కేంద్ర మంత్రి మాట్లాడారు. "జ్ఞాన్వాపి మసీదులో విచారణ గురించి కొంతమంది ఎందుకు ఆందోళన చెందుతున్నారు? ఏది నిజం అయితే అది బయటకు వచ్చి కోర్టులో హాజరు పరచబడుతుంది" అని అన్నారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లో 2017 ఆగస్టు 15న అంటే స్వాతంత్ర్య దినోత్సవాన తొలిసారి మదర్సా బోర్డు జాతీయ జెండా ఎగరేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. మళ్లీ ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో ప్రతి మదర్సా జాతీయ గీతాన్ని ఆలపించడాన్ని ప్రారంభించింది. మదర్సాల్లో తరగతులు ప్రారంభించడానికి ముందు విద్యార్థులు, ఉపాధ్యాయులు తప్పకుండా జాతీయ గీతాన్ని ఆలపించాలని యూపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను మే 12వ తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి. 

యూపీ మైనార్టీ శాఖ మంత్రి దానిష్ ఆజాద్ అన్సారీ ఈ ఆదేశాలను పాస్ చేశారు. మార్చి 24న నిర్వహించిన యూపీ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డులో ఈ నిర్ణయం తీసుకున్నారు. మే 12వ తేదీ నుంచి ప్రతి మదర్సాల్లో జాతీయ గీతాన్ని ఆలపించాలనే ఆదేశాలు మే 9వ తేదీ జారీ అయ్యాయి. ఈ ఆదేశాల ప్రకారం, మదర్సాలు ఇది వరకు ఆలపించిన మత పరమైన పాటలతోపాటు జాతీయ గీతాన్ని తప్పకుండా పాడాలి. రంజాన్ మాసం కారణంగా మదర్సాలు మార్చి 30వ తేదీ నుంచి మే 11వ తేదీ వరకు మూసేశారు. మళ్లీ మే 12వ తేదీనే మదర్సాలు తెరుచుకున్నాయి. ఈ ఆదేశాలను ఇవాళ్టి నుంచే అమలు చేశారు. ఈ ఆదేశాలు అన్ని గుర్తింపు పొందిన ఎయిడెడ్, నాన్ ఎయిడెడ్ మదర్సాలకు వర్తిస్తుంది.

యూపీ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డు చైర్‌పర్సన్ ఇఫ్తికార్ అహ్మద్ జావేద్ సారథ్యంలో మార్చి 24వ తేదీన జరిగిన సమావేశంలో జాతీయ గీత ఆలాపనపై నిర్ణయాలు తీసుకన్నారు. అదే విధంగా మదర్సాల్లో టీచర్ల నియామకానికి టెట్ ఆధారిత మదర్సా టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించనున్నట్టు బోర్డు తెలిపింది. మదర్సాల్లో బోధించాలంటే ఇందులో తప్పనిసరిగా అర్హులై ఉండాలని పేర్కొంది. అయితే, ఈ ఎన్నిక ప్రక్రియను అంతిమంగా మేనేజ్‌మెంట్ ఖరారు చేస్తుందని, దీనిపై త్వరలోనే ఓ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపనున్నట్టు వివరించింది.