ప్రధాని మోడీ క్యాబినెట్‌లో మైనార్టీ వ్యవహారాల మంత్రిగా ఉన్న ముక్తార్ అబ్బాస్ నఖ్వీ దేశంలోని పలు కీలక విషయాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మన దేశంలో ఏ మతాన్ని అయినా ఆచరించే హక్కును ప్రతి పౌరుడు కలిగి ఉన్నాడని తెలిపారు. అలాగే, పౌరులు ఏం తినాలి? ఏం తినకూడదు? అని చెప్పే పని ప్రభుత్వానిది కాదని అన్నారు. 

న్యూఢిల్లీ: దేశంలో ఇటీవలి కాలంలో భిన్న వర్గాల మధ్య ఘర్షణాత్మక వాతావరణం కనిపిస్తున్నది. ముఖ్యంగా శ్రీరామ నవమి నుంచి ఈ ఘర్షణలు పెచ్చుమీరాయి. మధ్యప్రదేశ్, గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో ఆ రోజున ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అదే రోజున ఢిల్లీలోని ప్రసిద్ధ విశ్వవిద్యాలయం జేఎన్‌యూలో నాన్ వెజ్ వంటకంపై ఘర్షణ చోటుచేసుకుంది. విద్యార్థుల మధ్య ఆ ఘర్షణలు దాడులు చేసుకునే వరకు వెళ్లింది. అంతకు ముందే కర్ణాటకలో హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.
అంతేకాదు, హలాల్ మాంసంపైనా రాజకీయం రగిలింది. ఈ నేపథ్యంలో కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

భారతీయులకు ఏ మతాన్ని అయినా ఆచరించే స్వేచ్ఛ ఉన్నదని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. దేశంలో భిన్న మతస్తుల మధ్య వైరం ఏమీ పెరగడం లేదని అన్నారు. కానీ, దేశంలో శాంతి సామరస్యాన్ని చూసి జీర్ణించుకోలేని కొన్ని మూకలు మాత్రమే దేశ బహుత్వాన్ని, సంప్రదయాన్ని అప్రతిష్టపాలు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు.

జేఎన్‌యూలో నాన్ వెజ్ ఆహారంపై దుమారం రేగిన సంగతి తెలిసిందే. రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్ స్టూడెంట్ల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. హలాల్ మాంసంపైనా రాజకీయం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన మాట్లాడుతూ, ప్రజలు ఏమి తినాలో తినకూడదో చెప్పడం ప్రభుత్వం పని కాదని అన్నారు. మన దేశంలోని ప్రతి పౌరుడికి వారికి ఇష్టమైన ఆహారాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ఉన్నదని తెలిపారు.

అదే విధంగా హిజాబ్ గురించి మాట్లాడుతూ, మన దేశంలో హిజాబ్‌పై నిషేధం లేదని వివరించారు. మార్కెట్ సహా ఇతర ప్రాంతాల్లో హిజాబ్ ధరించడంపై నిషేధం లేదని అన్నారు. కానీ, ప్రతి కాలేజీ, విద్యా సంస్థ డ్రెస్ కోడ్, డిసిప్లిన్, డెకోరమ్ కలిగి ఉంటాయని వివరించారు. దీన్ని మనం అంతా అంగీకరించాల్సిందేనని చెప్పారు. ఒక వేళ మీకు అవి నచ్చకుంటే వేరే విద్యా సంస్థను ఎంచుకోవచ్చని అన్నారు.

ఇదిలా ఉండగా, 

హ‌నుమాన్ జ‌యంతి ఉత్స‌వాల‌ను శ‌నివారం దేశవ్యాప్తంగా ఘ‌నంగా నిర్వ‌హించారు. ప్ర‌త్యేక పూజ‌లు, ర్యాలీలు నిర్వ‌హించారు. ఈ ర్యాలీలు చాలా చోట్ల స‌వ్యంగా జ‌ర‌గ‌గా.. కొన్నిచోట్ల మాత్రం ఉద్రిక్త‌త ప‌రిస్థితులకు దారి తీశాయి. ఢిల్లీలో చేప‌ట్టిన హనుమాన్ జయంతి ఊరేగింపులో కూడా ఆందోళ‌నక‌ర వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది. 

ఢిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలో శ‌నివారం రాత్రి చేప‌ట్టిన హనుమాన్ జ‌యంతి శోభాయాత్రలో ఘ‌ర్ష‌ణ‌లు జ‌రిగాయి. ఓ వర్గం ఈ ర్యాలీపై రాళ్లు రువ్వ‌డంతో ఇది చోటు చేసుకుంది. ఈ ఘ‌ర్ష‌ణ‌లో ఆరుగురు పోలీసు సిబ్బంది, ఓ పౌరుడికి గాయాలు అయ్యాయి. ఈ వివ‌రాల‌ను పోలీసు వ‌ర్గాలు వెల్ల‌డించాయి. 

గాయపడిన వారిలో ఢిల్లీ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ మేధలాల్ మీనా కూడా ఉన్నారు. ఆయ‌న చేతికి బుల్లెట్ గాయమైంది. అయితే ఆయ‌న‌ని ఎవ‌రు కాల్చారు ? ఎలా కాల్చారు అనే వివ‌రాలు ఇంకా తెలియరాలేదు. రాళ్లదాడి, హింసాత్మక ఘటనలకు సంబంధించి 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలు, వీడియోలను ఉపయోగించి మరింత మంది అనుమానితులను గుర్తించామని, వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసు వర్గాలు తెలిపాయి.

అల్లర్లు, హత్యాయత్నం, ఆయుధ చట్టం సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేసేందుకు క్రైమ్‌ బ్రాంచ్‌, స్పెషల్‌ సెల్‌ అధికారులు పది బృందాలను ఏర్పాటు చేశారు.హింసకు సంబంధించిన ప్రాథమిక విచారణ కుట్ర కోణంలో ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి.