తన పేరు పక్కన గాంధీ అన్న పదాన్ని తీసేసుకుంటానని... తనకు ఈ పేరు వల్లే ఈ కష్టాలన్నీ అంటున్నారు రాహుల్ గాంధీ. అందేంటీ... కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేరు మార్చుకోవడం ఏంటి..? ఆయన పేరుతో కష్టాలు రావడం ఏంటి అనుకుంటున్నారా..? నిజంగానే రాహుల్ గాంధీకి తన పేరు వల్ల కష్టాలు వచ్చాయి. కాకపోతే కాంగ్రెస్ నేత రాహుల్ కాదు.. సాధారణ పౌరుడు రాహుల్ గాంధీ.

ఇంతకీ మ్యాటరేంటంటే... మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ కి చెందిన 22ఏళ్ల ఓ యువకుడి పేరు రాహుల్ గాంధీ.  ఇంటి పేరు కూడా ఒకటే. కాంగ్రెస్ నేత పేరు తన పేరు ఒకటి అవ్వడం వల్ల తాను అనేక కష్టాలు పడుతున్నానని ఆ యువకుడు వాపోవడం గమనార్హం. 

తన పేరు కారణంగా ఇప్పటి వరకు తనకు ఆధార్ కార్డ్ తప్ప మరే ఇతర గుర్తింపు కార్డు లేదని వాపోయాడు. సిమ్ కార్డు తీసుకోవాలన్నా... బ్యాంకు లోన్ తీసుకోవాలన్నా కూడా తనకు ఎవరూ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తన ఆధార్ కార్డు చూపించినా కూడా నిజమని నమ్మడం లేదని తనని ఓ నకిలీ వ్యక్తిలా చూస్తున్నారని చెబుతున్నాడు.

పేరు చెప్పగానే తనను అనుమానంగా చూస్తున్నారని... ఎవరికైనా ఫోన్ చేసి తన పేరు  చెప్పగానే.. నకిలీ కాల్ అనుకొని ఫోన్ పెట్టేస్తున్నారని  అతను ఆవేదన వ్యక్తం చేశాడు. నిజానికి ఇతని పేరు రాహుల్ మాలవీయ. అయితే... అతని తండ్రి రాజేష్ మాలవీయ పార్లమెంటరీ ఫోర్స్ లో వాషర్ మ్యాన్ గా పనిచేసేవారు. దీంతో... అక్కడి అధికారులంతా రాజేష్ మాలవీయను గాంధీ అని పిలిచేవారు. క్రమంగా అదే వారి ఇంటి పేరుగా మారింది.

దీంతో స్కూల్లో కూడా రాహుల్ మాలవీయను చేర్చే క్రమంలో రాహుల్ గాంధీగా నమోదు చేశారని చెబుతున్నాడు. ఇప్పుడు ఈ పేరు కారణంగా తాను అనేక ఇబ్బందులు పడుతున్నానని.. అందుకే పేరు పక్కన గాంధీని తీయించేసుకోవాలని అనుకుంటున్నట్లు చెబుతున్నాడు.