Asianet News TeluguAsianet News Telugu

అప్పుడే వివాదంలో చిక్కుకున్న పంజాబ్ కొత్త సీఎం.. ప్రతిపక్షాల విమర్శలు, సిద్ధూ వల్లే అంతా

మంగళవారం సీఎం చరణ్‌జిత్ సింగ్ ప్రైవేట్ జెట్‌లో ఢిల్లీ పర్యటనకు వెళ్లడం వివాదానికి కారణమవుతోంది. ఇందులో పంజాబ్ పీసీసీ చీఫ్ సిద్ధూ, డిప్యూటీ సీఎంలు సుఖ్‌జిందర్ సింగ్, ఓపీ సోని కూడా ప్రయాణించారు. ఆ వెంటనే ప్రతిపక్షాలు ఈ టూర్‌పై మండిపడ్డాయి
 

What is the problem if a poor man takes a jet ride punjab cm Charanjit Channi after backlash
Author
Chandigarh, First Published Sep 23, 2021, 2:56 PM IST

నిన్న గాక మొన్న బాధ్యతలు స్వీకరించిన పంజాబ్ కొత్త సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ అప్పుడే వివాదంలో చిక్కుకున్నారు. ఆయనకు సంబంధించి ఫోటోపై రాజకీయ వివాదం ముసురుకుంది. మంగళవారం సీఎం చరణ్‌జిత్ సింగ్ ప్రైవేట్ జెట్‌లో ఢిల్లీ పర్యటనకు వెళ్లడం వివాదానికి కారణమవుతోంది. ఇందులో పంజాబ్ పీసీసీ చీఫ్ సిద్ధూ, డిప్యూటీ సీఎంలు సుఖ్‌జిందర్ సింగ్, ఓపీ సోని కూడా ప్రయాణించారు. కేబినెట్ కూర్పుపై హైకమాండ్‌తో అత్యవసర సమావేశం కోసం వారు చండీగఢ్ నుంచి ఢిల్లీకి వెళ్లారు. వాస్తవానికి సిద్ధూనే వివాదానికి కారణమవుతున్న ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఆ వెంటనే ప్రతిపక్షాలు ఈ టూర్‌పై మండిపడ్డాయి. ప్రత్యేక జెట్ విమానాల్లో ప్రయాణాలు చేయడం రాచరికపు పోకడలంటూ శిరోమణి అకాలీదల్, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపించారు. కేవలం 250 కిలో మీటర్ల ప్రయాణానికి ప్రైవేటు జెట్ అవసరమా? అంటూ విమర్శించారు. చండీగఢ్ నుంచి ఢిల్లీకి ప్రయాణించేందుకు సాధారణ వివామానాలు లేవా? కార్లు లేవా? అని ప్రశ్నించారు.  సామాన్యుల ప్రభుత్వమని చెప్పుకుంటూ.. జెట్ విమానాల్లో ప్రయాణిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని శిరోమణి అకాలీదల్ నేతలు ఆరోపించారు. ఈ చర్యతో పంజాబ్ కొత్త కేబినెట్ నిజస్వరూపం ఏంటో తెలిసిపోయిందంటూ పంజాబ్ ఆప్ నేత హర్పాల్ సింగ్ చీమా విమర్శించారు. మాటల ద్వారా కాదు..చేతల ద్వారా ఒకరి నైజం బయటపడుతుందని ఘాటు విమర్శలు చేశారు.

అటు మాజీ సీఎం అమరీందర్ సింగ్ మీడియా అడ్వైజర్ రవీన్ కూడా ఢిల్లీ ప్రయాణానికి 16 సీట్ల ప్రైవేటు జెట్‌ను వినియోగించడం సరికాదన్నారు. అత్యవసరమనుకుంటే ఐదు సీట్ల ప్రైవేట్ జెట్ లభిస్తుందని చురకలు వేశారు. సీఎం అమరీందర్ సర్కార్ నాలుగున్నరేళ్లుగా పొదుపు చర్యలు చేపట్టిందని గుర్తుచేశారు. అయితే తన పర్యటనపై రాజకీయ విమర్శలు వస్తుండటంతో సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్ని ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగారు. గరీబ్ (పేదవాడు) జెట్‌లో ప్రయాణం చేస్తే అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. ఇందులో వివాదం ఏంటో తనకు అర్థంకావడం లేదంటూ ఫైర్ అయ్యారు.

Follow Us:
Download App:
  • android
  • ios