ప్రస్తుతం దేశంలో నూతన మోటారు వాహన చట్టం అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది భారీ జరిమానాలు పడుతున్నాయి. ఈ క్రమంలో  ట్రాఫిక్ రూల్స్ అతి క్రమించారంటూ ఓ ఎండ్ల బండికి జరిమానా విధించారు. ఈ సంఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రూర్కీ పట్టణంలో చోటుచేసుకుంది. కాగా...  పోలీసులు విధించిన ఈ జరిమానాకి రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది.

తమ రాష్ట్రంలో ట్రాఫిక్ రూల్స్ ని ప్రభుత్వం మార్చినప్పటికీ... ఉత్తరాఖండ్‌ పోలీసులు భారీ జరిమానాలు విధిస్తుండటంతో ఆగ్రహం చెందిన డెహ్రాడూన్‌లోని చార్బా గ్రామ రైతులు రెండు మోటార్‌సైకిళ్లను తగులబెట్టారు.

కొత్త వాహన చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి పోలీసులు తమపై భారీగా జరిమానాలు విధిస్తున్నట్లు రైతులు ఆరోపించారు. చార్బా గ్రామానికి చెందిన రియాజ్‌ హసన్‌ అనే ఎడ్ల బండి యజమానికి పోలీసులు రూ. వెయ్యి చలానా విధించడంతో రైతుల్లో ఆగ్రహం మొదలైంది. అయితే వాహన చట్టంలో ఎడ్లబండికి చలానా విధించే నిబంధన లేదని తెలుసుకున్న పోలీసుల నాలిక్కరుచుకున్నారు. అనంతరం చలాన్‌ రద్దు చేసినప్పటికీ, రైతుల్లో ఈ విషయం తీవ్ర ఆవేదన కలిగించింది. భారీ చలాన్లపై రైతులు సోమవారం రోడ్డెక్కడంతో నిరసన హింసాత్మకంగా మారింది.